Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
  • వైభవ్ పవర్ హిట్టింగ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నా
  • వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా
Chris Gayle Vaibhav

Chris Gayle Vaibhav

ఐపీఎల్ 2026లో అద్భుతాలు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనియాడగా.. తాజాగా ఈ లిస్టులో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా చేరిపోయాడు. వైభవ్ పవర్ హిట్టింగ్‌ను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, రోజురోజుకు అతడికి అభిమానిగా మారిపోతున్నా అని చెప్పాడు. వైభవ్ లాంటి టాలెంట్ చాలా అరుదుగా పుడుతుందని పేర్కొన్నాడు. వైభవ్‌ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని గేల్ సూచించాడు. వైభవ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో 13 మ్యాచ్‌లలో 579 పరుగులు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్‌ 236.32గా ఉంది. ప్రస్తుతం వైభవ్ వద్దనే ఆరెంజ్ క్యాప్ ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను ఎంత ఎక్కువగా చూస్తున్నానో.. అంత ఎక్కువగా అతడికి అభిమానిగా మారిపోతున్నాను. చిన్న వయసులో అతడు ఆడుతున్న తీరు నిజంగా అద్భుతం. ఇంత చిన్న వయసులో టాప్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. ముఖ్యంగా వైభవ్ పవర్ హిట్టింగ్‌కు అసలు పోలికే లేదు’ అని అన్నాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక సిక్సర్లు కొట్టిన యువ ఆటగాడిగా వైభవ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనిపై స్పందించిన గేల్.. ‘ఇప్పుడే ఇలా ఆడుతుంటే భవిష్యత్తులో వైభవ్ ఎంత పెద్ద స్థాయికి వెళ్తాడో ఊహించలేం. వైభవ్‌ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టాలెంట్ ప్రతిరోజూ పుట్టదు. ప్రపంచ క్రికెట్‌లో ఒక తరం తర్వాతే ఇలాంటి ఆటగాళ్లు వస్తారు’ అని అభిప్రాయపడ్డాడు.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో తనను ఎక్కువగా ఆకట్టుకున్న అంశాల గురించి గేల్ వివరించాడు. ‘వైభవ్ బ్యాట్ స్పీడ్ అసాధారణం. షాట్ సెలెక్షన్ చాలా క్లాస్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి భయం లేకుండా ఆడే తీరు అద్భుతం. బ్యాట్ స్పీడ్, షాట్ సెలెక్షన్, నిర్భయమైన బ్యాటింగ్ శైలి.. అన్ని కలిపి తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే అద్భుత ప్రతిభావంతుడిగా అతడిని నిలుపుతున్నాయి’ అని యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ప్రశంసించాడు. ఈ సీజన్‌లో వైభవ్ ప్రపంచ స్థాయి బౌలర్లపై దూకుడుగా ఆడాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్జే వంటి టాప్ బౌలర్ల బంతులను కూడా సిక్సర్లుగా మలుస్తూ తన పవర్ హిట్టింగ్‌తో భయపెడుతున్నాడు. తాజాగా లక్నోపై కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి రాయల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. ఇప్పటికే సునీల్ గవాస్కర్, జస్టిన్ లాంగర్ వంటి దిగ్గజాలు వైభవ్ భవిష్యత్తుపై భారీ అంచనాలు వ్యక్తం చేయగా.. ఇప్పుడు క్రిస్ గేల్ వంటి పవర్ హిట్టింగ్ దిగ్గజం కూడా అతడిని ప్రత్యేక టాలెంట్‌గా అభివర్ణించడం సూర్యవంశీ స్థాయిని మరింత పెంచింది.