ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే తుది గడువు సమీపిస్తోంది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును సమర్పించేందుకు నవంబర్ 15 చివరి తేదీ. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీసీసీఐకి 10 ఫ్రాంచైజీలు తమ లిస్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ ఒప్పందాలను కొన్ని కుదిరాయి. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్లకు ముంబై ఒప్పందం చేసుకుంది. ఈ ట్రేడ్ ద్వారా ఐపీఎల్లో శార్దూల్ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు ట్రేడ్ చేయబడ్డ మొదటి ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఐపీఎల్ 2017కి ముందు ఠాకూర్‌ను పంజాబ్ కింగ్స్ నుంచి రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ కొనుగోలు చేసింది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రేడ్ చేసుకుంది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది. శార్దూల్ ట్రేడ్ అవ్వడం ఇది మూడోసారి. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత అందుకున్నాడు.
Also Read: IND vs SA 1st Test: మూడో స్థానంలో ఊహించని బ్యాటర్.. తొలి టెస్టులో ఆడే భారత జట్టు ఇదే!
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన మూడు ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఆరో ఆటగాడిగా కూడా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఈ మూడు జట్లకు ఇదివరకు హర్భజన్ సింగ్, టిమ్ సౌథీ, రాబిన్ ఉతప్ప, పియూష్ చావ్లా, అజింక్య రహానేలు ఆడారు. నిజానికి 2025 వేలంలో శార్దూల్ అమ్ముడుపోలేదు. రీప్లేస్మెంట్ ఆటగాడిగా రూ.2 కోట్లకు లక్నోలో చేరాడు. ఐపీఎల్ 2025లో 10 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు.