క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ప్రారంభ మ్యాచ్‌లో డిఫెడింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. 70వ లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇదే స్టేడియంలోనే జరగనుంది. ముంబై వాంఖెడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రాబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు, పూణే ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈసారి 12 డబుల్ హెడర్లు (ఒక రోజులో రెండు మ్యాచ్‌లు) ఉంటాయి. డబుల్ హెడర్‌లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అయితే, రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మే 29న జరగనుంది.
