INDW vs PAKW Sets New Records: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. దాయాదుల సమరంకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం (జూన్ 14) జరిగిన ఈ గ్రూప్-ఏ పోరు కేవలం మైదానంలోనే కాదు.. ప్రేక్షకాదరణలోనూ చరిత్ర సృష్టించింది. ఇండో-పాక్ మ్యాచ్ మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన మ్యాచ్‌గా నిలిచింది.
గ్రూప్ దశలోనే కొత్త రికార్డు:
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియానికి 18,814 మంది అభిమానులు హాజరయ్యారు. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లలో అత్యధిక ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా కొత్త రికార్డు నమోదైంది. ఇంతకుముందు 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌లో దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు 15,935 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. 2,800 మందితో గత రికార్డును అధిగమిస్తూ కొత్త మైలురాయిని భారత్-పాక్ మహిళల పోరు నెలకొల్పింది.
డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర:
స్టేడియంలో మాత్రమే కాదు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ భారీగా వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌కు ఏకంగా 163 మిలియన్ల డిజిటల్ రీచ్ నమోదైంది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ మ్యాచ్‌కూ ఇంత భారీ డిజిటల్ వ్యూయర్‌షిప్ లేదు. భారత్‌లోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ రికార్డు మరో నిదర్శనంగా నిలిచింది.
మహిళల క్రికెట్‌కు భారీ క్రేజ్:
ఈ మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకాదరణ, డిజిటల్ రికార్డులు మహిళల క్రికెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టం చేస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ ప్రత్యర్థిత్వం మహిళల క్రికెట్‌లో కూడా అదే స్థాయిలో అభిమానులను ఆకర్షిస్తోందని ఈ రికార్డులు నిరూపించాయి. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఈ మ్యాచ్ సాధించిన విజయాలు భవిష్యత్తులో మహిళల క్రికెట్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించే అవకాశముంది. భారత్ ఘన విజయంతో పాటు ప్రేక్షకాదరణలోనూ చరిత్ర సృష్టించడం ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది.
మైదానంలో భారత్ ఆధిపత్యం:
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 68 పరుగులతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. చివర్లో రిచా ఘోష్ 34 పరుగులతో జట్టును భారీ స్కోరు దిశగా నడిపించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ముఖ్యంగా దీప్తి శర్మ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఫలితంగా పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది.

