Aimchess Rapid tourney: చెస్ ఆటలో వరల్డ్ ఛాంపియన్, నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ఇటీవల తన ప్రాభావ్యాన్ని కోల్పోతున్నాడు. తరచూ భారత్ గ్రాండ్ మాస్టర్ల చేతిలో ఓటమి పాలవుతున్నాడు. ఇటీవల 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద… మాగ్నస్ కార్ల్‌సన్‌ను నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు ఓడించి చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. తాజాగా మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి కూడా మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. ఎయిమ్ చెస్ రాపిడ్ ఆన్ లైన్ టోర్నీలో 19 ఏళ్ల అర్జున్ ఇరిగైసి ఏడో రౌండ్‌లో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఈ పోరులో 54 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను అర్జున్ ఓడించాడు.
Read Also: Elephant in park: చిల్డ్రన్స్ పార్క్‌లో సరదాగా ఆడుకుంటున్న ఏనుగు.. వీడియో వైరల్
కాగా గత నెలలో జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్ లైన్ టోర్నీలో కార్ల్ సన్ చేతిలో అర్జున్ ఇరిగైసి ఓటమిపాలయ్యాడు. ఇప్పుడు ఆ ఓటమికి అతడు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఎయిమ్ చెస్ రాపిడ్ ఆన్ లైన్ టోర్నీలో అర్జున్ ఇరిగైసి మూడు వరుస గేమ్‌లలో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేనియల్ నరోడిట్స్‌కీ (అమెరికా), కార్ల్‌సెన్ (నార్వే)లను ఓడించాడు. అంతకుముందు జాన్ క్రిస్జ్‌స్టోఫ్ డుడా (పోలాండ్)తో ఆటను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడు 15 పాయింట్లతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోడిర్‌బెక్ అబ్దుసట్టోరోవ్ (17 పాయింట్లు), షాక్రియార్ మమెద్యరోవ్ (16 పాయింట్లు), కార్ల్‌సన్ (16 పాయింట్లు), దుడా (15 పాయింట్లు) తర్వాత ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు వరల్డ్ ఛాంపియన్ ఆటగాడిపై గెలవడం అర్జున్‌కు తన కెరీర్‌లో ఇదే తొలిసారి.