Site icon NTV Telugu

IND Vs PAK: టాస్ గెలిచిన భారత్.. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు

Asia Cup 2022

Asia Cup 2022

Ind Vs Pak: ఆసియాకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దినేష్ కార్తీక్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ 14 సార్లు తలపడగా 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా ఆరుసార్లు పాకిస్థాన్ గెలిచింది.

అటు వందో టీ20 ఆడుతున్న కోహ్లీకి టీమ్‌మేట్స్ రోహిత్, రాహుల్, సూర్య, హార్ధిక్, పంత్ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘ఇదో గొప్ప అచీవ్‌మెంట్. అతనో గొప్పఆటగాడు. కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నాం. మూడు ఫార్మాట్లలో ఇంత సుదీర్ఘ క్రికెట్ ఆడేవారిని భవిష్యత్‌లో చూడలేం. అతను గ్రౌండ్‌లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఆసియా కప్‌లో బాగా ఆడాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

మరోవైపు పాకిస్థాన్ విజయంపై ఆ జట్టు కోచ్ ముస్తాక్ ధీమా వ్యక్తం చేశాడు. మెయిన్ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిదీ జట్టులో లేకపోయినా… నసీమ్ షా, దహానీ, హరీస్ రౌఫ్ మంచి ఫాంలో ఉన్నారన్నాడు. టీమిండియా టాపార్డర్‌ను ఈ ముగ్గురు బౌలర్లు వణికిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ముగ్గురిపై తమ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌కు, కోచ్‌గా తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. షాహీన్‌ అఫ్రిదీ ఉంటే… పేస్‌ ఎటాక్‌ బలంగా ఉండేదని.. అతను లేకపోయినా మిగతా ముగ్గురు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మార్చేయగల సమర్థులు అని పేర్కొన్నాడు

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, చాహల్, అర్ష్‌దీప్, అవేష్ ఖాన్
పాకిస్థాన్‌: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫకార్ జమాన్, ఇఫ్తీకర్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, దహాని, రవూఫ్, నసీమ్ షా

Exit mobile version