NTV Telugu Site icon

దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌.. తొలి సిరీస్‌ కోసం టీమిండియా ఆరాటం..!

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్‌ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్‌ దూరం అయ్యాడు.. సిరాజ్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు.. రెండో టెస్ట్‌లో షాక్‌ ఇచ్చింది సౌతాఫ్రికా.. అయితే, చివరి టెస్ట్‌ మ్యాచ్‌లోనైనా సర్వశక్తులు ఒడ్డి అద్భుతాన్ని ఆవిష్కృతం చేయాలన్న పట్టుదలతో ఉంది భారత జట్టు..

Read Also: జ‌న‌వ‌రి 11, మంగళవారం దిన‌ఫ‌లాలు…

ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమం కావడంతో ఇవాళ కేప్‌టౌన్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నిర్ణాయక మ్యాచ్‌ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ గెలవని భారత్‌కు ఇదే చక్కటి అవకాశంగా విశ్లేషకులు చెబుతున్నారు… దక్షిణాఫ్రికా గడ్డపై తన కెప్టెన్సీలోనే జట్టుకు అపురూప విజయం అందించాలని కోహ్లీ తపన పడుతున్నాడు. అటు రెండో టెస్టులో గెలిచిన జోష్‌లో ఉన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లోనూ పట్టు సడలించకూడదని భావిస్తోంది. ఇవాళ ఫైనల్‌గా బరిలోకి దిగే జట్ల వివరాలు పరిశీలిస్తే.. భారత్‌ నుంచి కేఎల్ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్, చతేశ్వర్ పుజార, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రహానె, రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ పటేల్‌, అశ్విన్‌, షమి, బుమ్రా, ఇషాంత్‌ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, పీటర్సన్‌, డుస్సెన్‌, బవుమా, వెర్రెనీ, జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, రబాడ, ఒలివియెర్‌, ఎన్‌గిడి బరిలోకి దిగే అవకాశం ఉంది.. మరి పేసర్లకు బాగా అనుకూలించే కేప్‌టౌన్‌లో మ్యాచ్‌ గెలిచేది ఎవరు? తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ గెలిచి భారత్‌ సత్తా చాటుతుందా..? సౌతాఫ్రికానే ట్రోఫీని అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.