టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9గంటలకు డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన హార్డిక్ పాండ్యా సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ వేగంగా ఆడటంలో తడబాటుకు గురైంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ డ్రా చేసుకోవచ్చని ఐర్లాండ్ టీమ్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన హ్యారీ టెక్టర్‌పై మరోసారి ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. దాదాపు తొలి మ్యాచ్ ఆడిన జట్టునే ఐర్లాండ్ రెండో మ్యాచ్‌కు కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో అతడు మోకాలి గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో దీపక్ హుడా ఓపెనర్ అవతారం ఎత్తాడు. దీంతో రెండో మ్యాచ్‌లో రుతురాజ్ స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈరోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. దీంతో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. తొలి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌లోనూ ఆడనున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన అతడు 14 పరుగులు సమర్పించుకున్నాడు.