IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!

Ind Vs Afg

Ind Vs Afg

IND vs AFG: న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత ఆటగాళ్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆఫ్ఘన్ జట్టుకు అస్సలు చాన్సే ఇవ్వకుండా.. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం కావడం విశేషం.

గిల్, రాహుల్ సెంచరీల మోత..

టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు అద్భుతమైన పునాది వేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 రన్స్‌తో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 100 రన్స్‌తో సెంచరీ కొట్టి కదం తొక్కాడు. వీరిద్దరి సెంచరీల దాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇండియా నయా స్పిన్ సెన్సేషన్, డెబ్యూటెంట్ మానవ్ సుతార్ చుక్కలు చూపించాడు. తన కెరీర్ లోనే మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ.. ఎంతో కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తూ కేవలం 33 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్లు (6/33) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. సుతార్ స్పిన్ మ్యాజిక్‌కు ఆఫ్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది.

×
×
Ad

ఫాలోఆన్‌లోనూ దెబ్బ

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు తేడాతో వెనుకబడటంతో టీమిండియా కెప్టెన్ గిల్ ఆఫ్ఘన్ టీమ్‌కు ఫాలోఆన్ ఇచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా ఆఫ్ఘన్ బ్యాటర్లు ఫైట్ చేస్తారేమో అని అనుకుంటే.. మళ్లీ మన బౌలర్లు విజృంభించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ పవర్‌తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సుందర్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆఫ్ఘన్ జట్టు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేక కేవలం 112 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.