India Team Out Of Asia Cup: ఈసారి ఆసియా కప్‌లో భారత జట్టు ధనాధన్ విజయాలతో దూసుకెళ్తుందని.. ప్రత్యర్థుల్ని మట్టికరిపించి, సునాయాసంగా కప్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. ఇందుకు కారణం.. జట్టు బలంగా కనిపించడమే! ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోని ఆటగాళ్లందరూ.. ఐపీఎల్‌లో దుమ్ము దులిపినవారే! పరుగుల వర్షం కురిపించే బ్యాట్స్మన్లు, ప్రత్యర్థి బ్యాట్స్మన్లను ముచ్చెమటలు పట్టించే బౌలర్లు ఉండటంతో.. ఈ టోర్నీలో భారత జట్టుకి తిరుగు ఉండదని భావించారు. ఆ అంచనాలకి తగినట్టుగానే.. లీగ్ దశలో రెండు మ్యాచూలు గెలవడంతో, భారత్ కప్ కొట్టడం ఖాయమని అందరూ ఫిక్సైపోయారు. అఫ్‌కోర్స్.. లీగ దశలోని మ్యాచ్‌లని కాస్త కష్టంగానే గెలిచినా, జట్టుపై నమ్మకం తగ్గలేదు. సూపర్ ఫోర్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తారని అంచనా వేశారు.
కానీ.. సూపర్ ఫోర్‌లోకి అడుగుపెట్టాక ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి. ఏమాత్రం ఊహించని విధంగా.. పాకిస్తాన్, శ్రీలంక జట్లతో ఆడిన రెండు మ్యాచెస్‌లోనూ భారత్ పరాజయాల్ని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ టీమిండియా విఫలమైంది. చూడ్డానికి, ఆ రెండు జట్లకు కుదిర్చిన లక్ష్యాలు కొంచెం పెద్దవే. కానీ.. పూర్తి స్థాయిలో బ్యాటింగ్ విభాగంలో భారత్ చెలరేగలేదు. సూపర్ ఫోర్‌లో భాగంగా పాక్‌తో ఆడిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మినహాయిస్తే.. మిగతా బ్యాట్స్మన్లెవరూ తమ బ్యాటుని ఝుళపించలేకపోయారు. నిరాశాజనకమైన ప్రదర్శన కనబరిచారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ శర్మ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచారు. భువనేశ్వర్ కుమార్ లాంటి స్టార్ బౌలరే చేతులెత్తేశాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా విఫలమయ్యాడు. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. ఈసారి జట్టు పరంగా భారత్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది.
ఇలా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం వల్లే.. ఆసియా కప్ నుంచి భారత్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కాకపోతే.. భారత్‌కి ఇప్పటికీ ఒక ఛాన్స్ ఉంది. కానీ, అది దాదాపు సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిపోతే.. అప్పుడు రన్ రేట్ కలిసొచ్చి, భారత్‌కు ఫైనల్ వెళ్లే ఛాన్స్ ఉంది. మరి, అది సాధ్యమవుతుందంటారా? పాక్, లంక, ఆఫ్ఘన్ జట్లలో.. పాక్ జట్టే అత్యంత పటిష్టంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చితక్కొట్టేస్తోంది. కాబట్టి.. ఆ రెండు జట్ల చేతుల్లో పాక్ ఓటమి అన్నది అసాధ్యమే! అంటే.. ఇండియా జట్టు ఇంటి దారి పట్టక తప్పదు.