IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

India Playing 11 Vs Wi 4th T20i

India Playing 11 Vs Wi 4th T20i

IND Playing 11 vs WI 4th T20: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్లు హైదరాబాద్‌లో జరిగే నాలుగో టీ20కి సిద్ధమవుతున్నాయి. బుధవారం రాత్రి (అక్టోబర్ 14) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా.. పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది.

ఓపెనర్లుగా అభిషేక్, సంజు:


హైదరాబాద్ టీ20లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండోర్‌లో సంజు పరుగులు చేయలేకపోయినా.. అంతకుముందు రాంచీలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. హైదరాబాద్ మైదానంలోనూ అతడికి మంచి రికార్డు ఉండటంతో అతడే బరిలోకి దిగనున్నాడు. దాంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి షాక్ తగలనుంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానున్నారు. ఈ టాప్ ఆర్డర్‌పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే కీలక సమయంలో బ్యాటర్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఆల్‌రౌండర్లతో బరిలోకి భారత్:
నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు కాబట్టి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడగలరు. గత మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్యాట్, బంతితో రాణించడంతో హైదరాబాద్‌లోనూ ఆల్‌రౌండర్లపైనే జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచే అవకాశముంది.

కుల్దీప్ యాదవ్‌కు అవకాశం?:
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాస్త పెద్ద మైదానం కావడంతో బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ప్రిన్స్ యాదవ్‌ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ పేస్ బాధ్యతలు పంచుకొనున్నారు. చూడాలి మరి కెప్టెన్ శ్రేయాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.

హైదరాబాద్ టీ20కి భారత ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
సంజు శాంసన్ (వికెట్ కీపర్)
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
తిలక్ వర్మ
నమన్ ధీర్
నితీష్ కుమార్ రెడ్డి
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
అర్ష్‌దీప్ సింగ్
మయాంక్ యాదవ్