Site icon NTV Telugu

Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్.. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత

Asia Cup

Asia Cup

Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ఐసీసీ కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఒక మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే తక్కువగా ఓవర్లను బౌలింగ్ చేస్తే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్‌ ఫైన్‌తో పాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్‌ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఫీల్డింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

Read Also: Viral Video: ఇది బైక్ కాదు.. మినీ వ్యాన్.. ఒకే బైకుపై ఏడుగురు ప్రయాణం

ఈ నిబంధన ఇటీవల భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చేటు చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా చివరి రెండు ఓవర్లను ఆలస్యంగా వేసి మూల్యం చెల్లించుకుంది. నలుగురు ఫీల్లర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండటంతో పాకిస్థాన్ టెయిలెండర్ షానవజ్ దహాని ధాటిగా ఆడాడు. 130 పరుగులకే పరిమితమయ్యే జట్టు స్కోర్‌ను 147 వరకు తీసుకెళ్లాడు. అటు భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ మూడు ఓవర్లను ఆలస్యంగా వేసి మూల్యం చెల్లించుకుంది. ఫీల్డింగ్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండటంతో జడేజా, హార్దిక్ పాండ్యా ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలు రాబట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. కాగా భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్‌లో మరోసారి వచ్చే ఆదివారం తలపడే అవకాశం కనిపిస్తోంది. అప్పుడైనా స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకుంటారో లేదో వేచి చూడాలి.

Exit mobile version