ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు లీసెస్టర్ షైర్‌తో ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 246/8 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, కోహ్లీ, అయ్యర్, గిల్ వంటి ప్రతిభావంతులు భారీ స్కోర్లు చేయలేనిచోట తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఒక్కడే టీమిండియా పరువు కాపాడాడు. అతడు 70 పరుగులతో రాణించడంతో భారత్ 200 పరుగులకు పైగా స్కోర్ చేయగలిగింది. కోహ్లీ (33), రోహిత్ (25), ఉమేష్ (23) పరుగులు చేశారు. లీసెస్టర్ షైర్ బౌలర్లలో రోమన్ వాకర్‌కు 5 వికెట్లు దక్కాయి.
అనంతరం లీసెస్టర్ షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 2 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌లో పుజారా, రిషబ్ పంత్ ఇద్దరూ లీసెస్టర్ షైర్ తరఫున బరిలోకి దిగారు. పుజారా డకౌట్ కాగా రిషబ్ పంత్ 76 పరుగులతో రాణించాడు. పంత్ రాణించకపోతే లీసెస్టర్ షైర్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేది. టీమిండియా బౌలర్లలో షమీ, జడేజా మూడేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. పుజారా వికెట్‌ను షమీ తీయగా.. పంత్ వికెట్‌ను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించింది. గిల్ 38 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రీకర్ భరత్ (24) క్రీజులో ఉన్నాడు.