నవంబర్ 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కానున్నాయి. టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే రెండు టీమ్స్ ముమ్మర సాధన చేస్తున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రత్యేక బంగారు నాణెంను తయారు చేయించింది. ప్రత్యేక నాణెం టాస్ సమయంలో ఉపయోగించబడుతుందని క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
టాస్ కోసం క్యాబ్ ప్రత్యేకంగా తయారు చేయించిన నాణెం గోల్డ్ కాయిన్. ఈ కాయిన్‌కు ఒక వైపు భారత జాతిపిత మహాత్మా గాంధీ, మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రం ఉంటుంది. శాంతి, స్వేచ్ఛ, అహింస మార్గంలో నడిచిన మహనీయులు గాంధీ-మండేలాల గౌరవార్థం ఈ స్పెషల్ కాయిన్ రూపొందించారు. ఈ నాణెంను టెస్ట్ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో టాస్ సందర్భంగా ఉపయోగించనున్నారు. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా గౌరవార్థం 2015 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను ‘ఫ్రీడమ్ ట్రోఫీ’గా పిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఆరు సంవత్సరాల తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. దీంతో టెస్ట్ మ్యాచ్ అయినా అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెరిగింది. మొదటి 3 రోజుల టికెట్లు పూర్తిగా అమ్ముడైనట్లు క్యాబ్ కోశాధికారి సంజయ్ దాస్ తెలిపారు. మొదటి 3 రోజులకు ఇప్పటికే 96,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని, మొత్తం 14 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని చెప్పారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత కోసం కోల్‌కతా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.