ICC New Rules: పురుషుల క్రికెట్‌లో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని మెన్స్ కమిటీ సిఫారసులను చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) ఆమోదించింది. కొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం కరోనా సమయంలో రెండేళ్ల పాటు సలైవా (బంతిపై ఉమ్మి రుద్దడం)పై ఐసీసీ నిషేధం విధించగా ఇప్పుడు శాశ్వతంగా బ్యాన్ విధించింది. అటు టెస్టులు, వన్డేల్లో కొత్తగా వచ్చే బ్యాటర్ రెండు నిమిషాల్లో స్ట్రైక్ తీసుకోవాలి. గతంలో ఈ వ్యవధి 3 నిమిషాలుగా ఉండేది. టీ20ల్లో అయితే 90 సెకన్‌లలో బ్యాటర్ స్ట్రైక్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాటర్ క్యాచ్ ఔట్ అయితే కచ్చితంగా కొత్తగా వచ్చే బ్యాటర్ స్ట్రైక్ తీసుకోవాలి. ఈ రూల్ ప్రకారం క్యాచ్ అవుట్‌కు ముందు క్రీజులో ఉన్న బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ అయ్యారా లేదా అనే విషయంతో సంబంధం ఉండదు. ఐసీసీ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం బౌలింగ్ వేసే టైంలో ఫీల్డింగ్ టీమ్ ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే ఆ జట్టుకు 5 పరుగులు జరిమానా విధిస్తారు. అంటే ప్రత్యర్థి స్కోరు బోర్డులో ఐదు పరుగులను అదనంగా జోడిస్తారు.
ఇకపై మన్కడింగ్ చట్టబద్ధం
ఇప్పటివరకు నాన్ స్ట్రైకర్ వైపు ఉండే బ్యాటర్ క్రీజులో లేకపోతే బౌలర్ అవుట్ చేసే పద్ధతిని మన్కడింగ్‌గా పిలిచేవాళ్లు. అయితే ఇకపై దీనిని చట్టబద్ధంగా మార్చి రనౌట్‌గా పరిగణించనున్నారు. గతంలో మన్కడింగ్ అనేది దుమారం రేపడంతో ఐసీసీ దీనిని రనౌట్‌గా మార్పు చేసింది. మరోవైపు స్ట్రైక్ చేస్తున్న బ్యాటర్ తన బ్యాట్‌ను గానీ, తన కాలు కొంత భాగాన్ని పిచ్‌లో ఉండేలా చూసుకోవాలి. వారు పిచ్ వీడి లెగ్ సైడ్ లేదా ఆఫ్ సైడ్ లేదా బయటకు వస్తే దాన్ని అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటిస్తాడు. ఇకపోతే బౌలర్ స్ట్రైకర్‌కు అందకుండా ఆఫ్ సైడ్ గానీ, లెగ్ సైడ్ గానీ వైడ్‌కు మించి చాలా దూరంగా బంతి వేస్తే అంపైర్ దానిని నో బాల్ ప్రకటిస్తాడు. కాగా బౌలర్ తమ డెలివరీ స్ట్రైడ్‌లోకి ప్రవేశించేముందే బ్యాటర్ వికెట్ల నుంచి పిచ్ ముందుకు దూసుకువస్తే బౌలర్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడానికి బంతిని విసిరేవాడు. ఇప్పుడు అలా కుదరదు. ఇకపై అంపైర్ ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా పేర్కొంటాడు. కాగా ఈ మార్పులను ప్రతిబింబించేలా అన్ని ప్లేయింగ్ కండిషన్‌లు అప్‌డేట్ అవుతాయని ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చీఫ్ గంగూలీ వివరించాడు.
Read Also:RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు