Hardik Pandya: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లోనే సెంచరీ చేసి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సూర్యకుమార్ ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన విధ్వంసక ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడని పాండ్యా అన్నాడు. అతడు అంత సులభంగా ఎలా ఆడుతున్నాడో తనకు అర్ధం కావడం లేదని.. ఒకవేళ తాను బౌలర్‌ను అయ్యి ఉంటే సూర్యకుమార్ కొట్టే షాట్లకు భయపడేవాడిని అంటూ ప్రశంసలు కురిపించాడు. ఎందుకంటే మైదానంలో అతడు చాలా షాట్లు ఆడుతున్నాడని తెలిపాడు. అటు రాహుల్ త్రిపాఠి కూడా బాగా ఆడాడని.. తొలుత పిచ్ బౌలర్లకు సహకరించినా పవర్‌ప్లేలో త్రిపాఠి దూకుడుగా ఆడటం జట్టుకు టర్నింగ్ పాయింట్ అయ్యిందని పాండ్యా వివరించాడు.
Read Also: Nitish Kumar: జనాభా నియంత్రణ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ విమర్శలు
అటు తన ఆట వెనుక చాలా కష్టం దాగుందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. మ్యాచ్ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో మనపై ఒత్తిడి తెచ్చుకోవడం చాలా ముఖ్యమని.. ప్రాక్టీస్‌లో ఆ పని చేస్తే.. మ్యాచ్ ఆడటం కొంచెం సులభం అవుతుందని అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో చాలా హార్డ్ వర్క్ ఉంటుందని.. కానీ అది పైకి కనిపించదని సూర్యకుమార్ అన్నాడు. క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్స్ చాలా ముఖ్యమని.. మన ఆట ఏంటో అర్ధం చేసుకుని దానికి తగ్గట్లే ప్రిపేర్ అవ్వాలని పేర్కొన్నాడు. రాజ్‌కోట్ మైదానంలో బ్యాటర్‌కు వెనుక వైపు ఉండే బౌండరీలు 50-60 మీటర్లు మాత్రమే ఉంటాయని, అందుకే వాటిని తను టార్గెట్ చేశానని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. తాను కొన్ని షాట్లకు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటానని.. ఒకవేళ బౌలర్లు ప్లాన్ ఛేంజ్ చేస్తే దానికి తగ్గట్లుగా మరికొన్ని షాట్లను ప్రాక్టీస్ చేస్తానని సూర్యకుమార్ చెప్పాడు. తన ఆట విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్దగా జోక్యం చేసుకోడని వివరించాడు.