ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో డీలా పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జట్టుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలంలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను చెన్నై జట్టు తిరిగి దక్కించుకుంది. దీంతో అతడి సేవలు రవీంద్ర జడేజా నేతృత్వంలోని టీమ్‌కు తప్పనిసరిగా మారాయి. ఎందుకంటే చెన్నై టీమ్‌కు దేశవాళీ బౌలర్లు కరువయ్యారు. తొలి రెండు మ్యాచ్‌లలో తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి అంచనాల మేర రాణించలేకపోయారు. దీంతో డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు కనిపించింది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు వేలంలో కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే ఢిల్లీ జట్టు ఆడబోయే తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా త్వరలోనే జట్టులో చేరబోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. పాకిస్థాన్ పర్యటన కారణంగా డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో అతడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో చేరడం ఆ జట్టుకు ఊరటనిస్తోంది.