Gautam Gambhir Reacts On India vs Pakistan Row: కొన్ని రోజుల నుంచి భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ఆడబోదని తొలుత జై షా వ్యాఖ్యలు చేస్తే.. తాము కూడా భారత్‌లో వరల్డ్‌కప్ ఆడమని పాక్ రియాక్ట్ అయ్యింది. మాజీలు సైతం పరస్పర కామెంట్లు చేసుకున్నారు. భారత అభిమానులైతే గట్టిగానే కౌంటర్లిచ్చారు. పాక్ ఆడకపోతే.. ఆ దేశానికే నష్టమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘పాక్‌లో భారత్ ఆడకపోతే, తాము కూడా ఆ దేశంలో ఆడేది లేద’ని పీసీబీ చీఫ్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. అందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని, తమను ఎవరూ శాసించలేరని బదులిచ్చారు.
ఇప్పుడు తాజాగా భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ఇది బీసీసీఐ, పీసీబీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమని.. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా తీసుకోవాలని చెప్పాడు. ఇక ఇదే సమయంలో.. బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు అని, ఆ బోర్డు తన ఆదాయంలో యాభై శాతాన్ని ఇతర క్రీడలకు వెచ్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తే, మన భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకాల పంట పండటం ఖాయమని తెలిపాడు. ప్రతి ఏడాది తన ఆదాయాన్ని పెంచుకుంటున్న బీసీసీఐ.. అందులో నుంచి యాభై శాతం క్రికెటర్ల జీతాలు, ఇతరత్రా ఖర్చులకు వెచ్చించి.. మిగిలిన యాభై శాతం ఇతర క్రీడలు, క్రీడాకారులకు వెచ్చించాలని కోరాడు. రానున్న రోజుల్లో దేశాభివృద్దికి క్రీడలు ఎంతగానో దోహదం చేయనున్నాయని.. దేశంలోని పిల్లలను ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు బానిసలను చేయడం కన్నా, శారీరక దారుఢ్యం పెంచుకునే క్రీడల వైపుకు మళ్లించడం ఎంతో ముఖ్యమని సూచించాడు. క్రీడాకారులను గుర్తించి.. వారికి మంచి శిక్షణ, మౌళిక వసతులు కల్పిస్తే.. ఊహించిన ఫలితాలు తప్పకుండా నమోదు అవుతాయని చెప్పుకొచ్చాడు.