గత నాలుగేళ్లుగా టీమిండియా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్ల జట్టులో తక్షణమే మార్పులు చేయాలని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని తాము ఆడుతున్నామని… దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవాలన్నాడు. భారత జట్టుకు కెప్టెన్సీ వహించాలన్నది తన కల అని.. అది సాకారమైందని కేఎల్ రాహుల్ అన్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ఏదో సాకు చెప్పాలని తాను అనుకోవడం లేదని.. అయితే ఆ ఓటముల నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు.
Read Also: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా మహిళా క్రికెటర్
గడిచిన మూడేళ్లలో కెప్టెన్‌గా తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు. జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అన్ని విషయాలను నేర్చుకునే సౌలభ్యం ఉంటుందన్నాడు. ఆటలో పొరపాట్లు చేయడం సహజమేనని.. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని.. కెప్టెన్‌గా తాను ఇదే నేర్చుకున్నానని తెలిపాడు. జట్టు సభ్యుల నుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టేందుకు కృషి చేస్తానని… ఐపీఎల్‌లో అయినా, భారత జట్టుకు సారథ్యం వహించినా మెరుగ్గా రాణించగలననే నమ్మకం ఉందని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.