NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేసి.. నా పదవిని కోల్పోయా! మాజీ చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్

Virat Kohli Odi

Virat Kohli Odi

Dilip Vengsarkar revealed How He chose Virat Kohli over S Badrinath: ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం ఆటగాళ్లలో అత్యుత్తమ క్రికెటర్. 25 వేలకు పైగా రన్స్, 75 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యం అయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స బద్దలు కొట్టిన విరాట్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే ఇలాంటి ఆటగాడి కారణంగా ఒకరి సీటు కిందకే ఎసరొచ్చిందట. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ పదివినే కోల్పోయాడట. ఆయన మరెవరో కాదు భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ సారథ్యంలో 2008 అండర్ 19 ప్రపంచకప్ భారత్ గెలిచింది. తర్వాత కోహ్లీని భారత్ ఏ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు పంపాము. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌ జట్ల మధ్య ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీ జరిగింది. చీఫ్ సెలెక్టర్‌ పదవిలో ఉన్న నేను ఆ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లా. బలమైన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ (123) చేశాడు. ఆ సమయంలో భారత జట్టులో ఓ ఖాళీ ఉంది. దానికి కోహ్లీ సరైనోడని భావించి.. శ్రీలంక పర్యటన వెళ్లిన భారత వన్డే జట్టులోకి అతడిని తీసుకున్నా’ అని తెలిపారు.

Also Read: BCCI Chief Selector: శాలరీ తక్కువని.. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవిని వద్దనుకున్న భారత దిగ్గజం!

‘మీ నిర్ణయం మాకు ఓకే కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎన్ శ్రీనివాసన్‌కు నచ్చదని బీసీసీఐ సెలెక్టర్లు నాతో అన్నారు. తమిళనాడుకు చెందిన ఎస్ బద్రీనాథ్‌ను శ్రీనివాసన్‌ ఆడించాలనుకుంటున్నారని తెలిపారు. విరాట్ కోహ్లీ కారణంగా ఎంఎస్ ధోనీ, శ్రీనివాసన్ ఆగ్రహానికి గురవుతారని చెప్పారు. కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఒప్పుకోడన్నారు. నేను అవేమి పట్టించుకోఉండా కోహ్లీని ఎంపిక చేశా. కోహ్లీని తీసుకుంటే.. బద్రీనాథ్‌కు చోటు దక్కదని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్నా. అప్పుడు శ్రీనివాసన్‌ జట్టు చెన్నైకి బద్రీనాథ్ ఆడుతున్నాడు’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు.

‘బద్రీనాథ్‌ను ఎందుకు తీసుకోలేదు అని మరుసటి రోజు శ్రీనివాసన్ అడిగారు. ఎమర్జింగ్ టూర్‌లో విరాట్ కోహ్లీ బాగా ఆడాడని చెప్పా. తమిళనాడు తరఫున బద్రీనాథ్ 800 పరుగులు చేశాడని శ్రీనివాసన్ అన్నారు. త్వరలోనే బద్రీనాథ్ కూడా జట్టులోకి వస్తాడని బదులిచ్చా. సచిన్ టెండూల్కర్ గాయంతో దూరం కాగా.. బద్రీనాథ్‌కు అవకాశం దక్కింది. కానీ అతడు విఫలమయ్యాడు. ఈ విషయాలను కృష్ణమాచారి శ్రీకాంత్ ద్వారా అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శరద్ పవార్‌ వద్దకు శ్రీనివాసన్ తీసుకెళ్లారు. నేను ఇంటికి వచ్చేసా’ అని వెంగ్‌సర్కార్ తన కెరీర్ గురించి చెప్పకొచ్చారు.

Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర! లేటెస్ట్ రేట్లు ఇవే