టీ20 మ్యాచ్‌లలో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాటింగ్ చేసేవాళ్లు సిక్సులు, ఫోర్ల బాదడమే పనిగా పెట్టుకోవడంతో బౌలర్లు చెత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ టీ20 2022 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా సోమర్‌సెట్, డెర్బీషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన డెర్బీషైర్ మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తన స్పెల్‌లో అతడు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దాదాపు 20.5 ఎకానమీ రేటుతో మెకరైన్ పరుగులు ఇవ్వడం గమనార్హం. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ బౌలర్ సర్మద్ అన్వర్ పేరిట ఉండేది. 2011లో సూపర్ ఎలైట్ టీ20 కప్‌లో అన్వర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 81 పరుగులు ఇచ్చాడు.
Read Also: SmartPhone: స్మార్ట్‌ఫోన్ యూజర్లు.. సేఫ్‌జోన్‌లో ఉండాలంటే..
కాగా ఈ మ్యాచ్‌లో సోమర్‌సెట్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 265 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా ఈ టోర్నీలోనే అత్యధిక స్కోరును సోమర్‌సెట్ టీమ్ నమోదు చేసింది. సోమర్‌సెట్ బ్యాటర్లలో రోసోవ్ 93, బాంటన్ 73 పరుగులతో రాణించారు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెర్భీషైర్ 74 పరుగులకే కుప్పకూలింది. సోమర్‌సెట్ బౌలర్లలో పీటర్ సిడిల్, గ్రీన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. లూయిస్ గ్రెగొరీ రెండు వికెట్లు, ఓవర్టన్ ఒక్క వికెట్ సాధించారు. రోసౌవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
https://twitter.com/SumitRa00501056/status/1545986374175965185