Football Player: ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అమీర్ నసర్ అజాదాని అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా గత కొంతకాలం నుంచి అమీర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడటం లేదు. అయితే సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల మహ్స అమిని అనే ఇరాన్ మహిళ పొలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మరణించింది. ఈ నేపథ్యంలో అమిని మరణానికి ప్రభుత్వం, పోలీసులే కారణం అంటూ మహిళా హక్కులపై పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
Read Also: Gujarat: గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేర చరితులే.. 151 మంది కోటీశ్వరులు
వాస్తవానికి హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో ప్రభుత్వానికి చెందిన మోరల్ పోలీసులు అమిని అనే మహిళను అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె అనుమానాస్పదంగా చనిపోవడంతో దేశ వ్యాప్తంగా మహిళల హక్కులు, ప్రాథమిక స్వేఛ్చ మొదలైన అంశాలపై ఆందోళనలు చెలరేగాయి. ఇది పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు సైనికులు, ఓ గార్డ్ చనిపోయారు. ఈ ఘటనకు తానే కారణమని ఫుట్‌బాల్ ఆటగాడు అమీర్ ఒప్పుకోవడంతో మరణశిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 20 న అమీర్ టీవీలో కనిపించి ఆ హత్యలకు కారణం తానేనని అంగీకారం తెలిపాడు.
అయితే మహిళల హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అమీర్‌కు మరణ శిక్ష విధించడం దారుణమని ఫిఫ్ప్రో అనే సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65వేల మంది ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తోంది. కాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం ఇటీవల మరణశిక్ష అమలు చేయడం గమనించాల్సిన విషయం.