గత ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. వార్నర్ రాకతో పీఎస్ఎల్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. పైగా కరాచీ కింగ్స్ జట్టు అతనికి జట్టు పగ్గాలు అప్పగించింది. కానీ ఐపీఎల్ లో సక్సెస్ అయిన డేవిడ్ భాయ్.. పీఎస్ఎల్ లో సక్సెస్ కాలేకపోయాడు. డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 60 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పెషావర్ జల్మీతో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే మిగతా 5 మ్యాచ్‌ల్లో కేవలం 50 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో వార్నర్ పై పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వార్నర్ 2 కోట్లకు తగ్గట్టే ఆడుతున్నాడని, బీసీసీఐ కల్పించిన సౌకర్యాలు పిసిబి కల్పించనందుకే వార్నర్ ప్రదర్శన ఇలా ఉందంటూ ఫైర్ అవుతున్నారు. అటు వార్నర్ తో తమ ఫ్రాంచైజీ బ్రాండింగ్ ని పెంచుకోవాలనుకున్న కరాచీ కింగ్స్ కు నిరాశే మిగిలింది. నిజానికి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్ గా కొనసాగాడు. 2009 నుంచి 2024 మధ్య అతను 184 మ్యాచ్‌లలో 4 సెంచరీలు 62 అర్ధ సెంచరీల సహాయంతో 6565 పరుగులు చేశాడు. వార్నర్ ఐపీఎల్ కెరీర్ మొదట డీసీతోనే ప్రారంభమైంది. దీన్ని అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా పిలిచేవారు. 2009లో టైటిల్ విజేతగా నిలిచిన ఈ జట్టులో వార్నర్ ఆడాడు. 2014 లో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చాడు. 2016లో ఆ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలిపోవడంతో ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఆడే చాన్స్ లేకుండా పోయింది. కాగా డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టుల్లో 8786 పరుగులు, 161 వన్డేల్లో 6932 పరుగులు, 110 టీ20ల్లో 3277 పరుగులు చేశాడు.