ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 91పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ల దెబ్బకు 17.4 ఓవర్లలో ఢిల్లీ 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. వార్నర్ (19), శ్రీకర్ భరత్ (8), మిచెల్ మార్ష్ (25), రిషబ్ పంత్ (21) వరుసగా విఫలమయ్యారు.
చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3 వికెట్లు తీసి ఢిల్లీని భారీ దెబ్బ కొట్టాడు. బ్రావో 2, ముఖేష్ చౌదరి 2, సిమర్ జిత్ సింగ్ 2 వికెట్లు పడగొట్టి చెన్నైని గెలిపించారు. అంతకుముందు టాస్ ఓడి చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. కాన్వే (87), రుతురాజ్ గైక్వాడ్ (41), శివమ్ దూబే (32) పరుగులతో మెరుపులు మెరిపించారు. కాన్వే 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. చివర్లో ధోనీ (21) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీశాడు. కాగా పాయింట్ల టేబుల్‌లో చెన్నై 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ 10 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.