Shikhar Dhawan To Lead Team India in Asian Games 2023: చైనాలోని హాంగ్‌జై నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా భాగం చేశారు. దాంతో ప్రపంచ దేశాల్లోని అన్ని జట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మహిళల సీనియర్ క్రికెట్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొననుండగా.. ద్వితీయ శ్రేణి పురుషుల జట్టు ఆడే అవకాశం ఉంది. ఈ జట్టుకు టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా భారత్ పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక జట్లు పాల్గొన్నాయి. బీసీసీఐ మాత్రం జట్లను పంపించలేదు. ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ 2023కి జట్లను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. అయితే భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో బీసీసీఐ వెనక్కి తగ్గింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టుని పంపించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2023లో సత్తాచాటిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్‌లతో పాటు ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసి చైనాకు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పాల్గొనే విషయంపై జూలై 7న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు భారత జట్టు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటంపై కూడా ఓ పాలసీని రూపొందించాలనే విషయంపై కూడా చర్చించనున్నారు.
ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జైలో జరగనున్నాయి. వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి పురుషుల జట్టు, హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సీనియర్ మహిళల జట్టును ఏషియన్ గేమ్స్‌లో ఆడించాలని బీసీసీఐ చూస్తోంది. గతంలోనూ భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లపై భారత జట్టును గబ్బర్ నడిపించాడు.
Also Read: Bank Accounts Rules: ఓ వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?