పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక ఘోర పరాజయం పాలైతే పసికూన బంగ్లాదేశ్ మాత్రం సఫారీలకు సొంత గడ్డపైనే చుక్కలు చూపించి వన్డే సిరీస్ ఎగురేసుకుపోయింది. కోహ్లీ, రాహుల్, పంత్, ధావన్ లాంటి హేమాహేమీలు ఉన్న జట్టు చతికిలపడిన చోట బంగ్లాదేశ్ ఆటగాళ్లు చూపించిన తెగువపై ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం కారణంగా మూడింటికి మూడు వన్డేల్లోనూ ఓడి టీమిండియా వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దీంతో తాజాగా బంగ్లాదేశ్ విజయాన్ని ఉద్దేశించి ఆ జట్టు ఆటగాళ్లను చూసి టీమిండియా ఆటగాళ్లు బుద్ది తెచ్చుకోవాలని పలువురు చురకలు అంటిస్తున్నారు.
