“ఈ సాల కప్ నమ్ దే ” అనే నినాదం ప్రతీ సీజన్ వినీ వినీ విసుగొస్తుంది గాని కప్ మాత్రం కొట్టడం లేదు. దీంతో ఈ నినాదం వచ్చే సీజన్ కి పోస్టుపోన్ అవుతుంది. గత 15 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. కనీసం తాజాగా ముగిసిన సీజన్‌లోనైనా ఆర్‌సీబీ టైటిల్ కొడుతుందని భావించినా.. ఆ జట్టు ప్రయాణం రెండు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరి ఎలిమినేటర్ అడ్డంకి ధాటినా.. క్వాలిఫయర్ 2 రూపంలో దురదృష్టం వెంటాడింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సమష్టిగా ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. అయితే ఈ సీజన్‌లో అన్ని విభాగాలు బాగానే రాణించినప్పటికీ.. ఒక బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. స్పిన్నర్ హసరంగా వికెట్లు తీయడంతో ఆ లోటు పెద్దగా కనబడలేదు కానీ.. జట్టుకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగింది.
అయితే వచ్చే సీజన్‌కు ఆ జట్టు ఈ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తుంది. కేవలం మినీ వేలం జరిగే అవకాశం ఉంది కాబట్టి జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కానీ ఓ నలుగురి ఆటగాళ్లకు మాత్రం గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరో చూసేద్దామా …
1. మహమ్మద్ సిరాజ్
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు మహమ్మద్ సిరాజ్‌ను ఆర్‌సీబీ రూ.7 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో నిలకడగా రాణించడంతో పాటు టీమిండియా తరపున కూడా అద్భుత ప్రదర్శన కనబర్చడం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ఉండటంతో అతన్ని రిటైన్ చేసుకుంది. కానీ అతను మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 9 వికెట్లు మాత్రమే తీసాడు. 10.08 ఎకానమీతో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
2. డేవిడ్ విల్లే
మెగా వేలంలో 2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన డెవిడ్ విల్లే ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఆరంభంలో అవకాశం దక్కినా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ రాకతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన విల్లే కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. అయితే నలుగురి ఫారిన్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో విల్లేకు చోటు దక్కడం కష్టంగా మారింది.
3. షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్
షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్‌ది కూడా విల్లే పరిస్థితే. తుది జట్టులో చోటు దక్కడం ఈ విండీస్ ఆల్‌రౌండర్‌కు కష్టంగా మారింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కాదని అతన్ని ఆడించే సాహసం ఆర్‌సీబీ చేయదు. ఆరంభ మ్యాచ్‌ల్లో అవకాశం అందుకున్న రూథర్ ఫోర్డ్.. కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు.
4. అనూజ్ రావత్
ఆర్‌సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగిన అనూజ్ రావత్‌ను కూడా ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రావత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 16.13 సగటుతో కేవలం 129 పరుగులే చేశాడు.