Ashton Agar Heated Argument With Filed Umpire: అప్పుడప్పుడు క్రికెటర్లు మైదానంలో హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. తప్పు తమదే అయినప్పటికీ, అంపైర్లతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ కూడా అలాగే చెలరేగిపోయాడు. తప్పు తనదే అయినప్పటికీ, దాన్ని ఒప్పుకోకపోగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బూతులు కూడా తిట్టాడు. దీంతో, అతని వైఖరిపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి. అసలేం జరిగిందంటే.. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో.. డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్స్ క్రీజులో కుదురుకున్నారు. వారి జోడిని విడదీయడం ఆస్ట్రేలియా బౌలర్లకు సవాలుగా మారింది.
అప్పుడు ఆస్టన్ అగర్‌ని రంగంలోకి దింపారు. అతడు పద్ధతిగా బౌలింగ్ వేసి, వికెట్లు తీయకుండా.. బంతి వేసిన వెంటనే పిచ్‌పైకి వస్తూ బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఒకట్రెండు సార్లైతే ఏమో అనుకోవచ్చు, కానీ ఆస్టన్ మాత్రం పదే పదే పిచ్‌పైకి వచ్చి, బ్యాటర్లను అడ్డొచ్చాడు. అది గమనించిన ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్.. ‘పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్ కాదు’ అని సూచించాడు. అది విన్న ఆస్టన్.. ‘‘మీరు నాకు చెప్పడమేంటి? నేను బంతిని అంచనా వేయడం కోసం పరిగెడుతున్నా’’ అంటూ సమాధానమిచ్చాడు. అతని వివరణతో ఏకీభవించని అంపైర్.. ‘‘బ్యాటర్ బంతిని మిడ్ వికెట్ వైపు కొడితే, నువ్వు నువ్వు పిచ్‌పైకి ఎందుకొస్తున్నావ్? బ్యాటర్‌ను అడ్డుకోవడం కోసమేగా’’ అంటూ చెప్పాడు. ఆ మాట విన్నాక కోపం కట్టలు తెంచుకున్న ఆస్టన్.. అంపైర్ మీదకు దూసుకొస్తూ అసభ్యకరమైన పదంతో దూషించాడు. అనంతరం ఇద్దరు వాదులాడుకున్నారు. అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు, ఆస్టన్‌కు జరిమానా పడే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రైలియా జట్టు బౌలింగ్ ఎంపిక చేయడంతో, బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డేవిడ్ మలన్ (128 బంతుల్లో 134) ఒక్కడే సెంచరీతో రాణించడంతో.. ఇంగ్లండ్ స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 287 పరుగులు చేసింది. ఇక 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఇంకా ఆరు వికెట్లు మిగిలుండగానే 46. 1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. డేవిడ్ వార్నర్ (86), ట్రావిస్ (69), స్టీవ్ స్మిత్ (80) సత్తా చాటడంతో.. ఆసీస్ జట్టు సునాయాసంగా గెలుపొందింది.