Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!

Abhishek Sharma Vs Virat Kohli

Abhishek Sharma Vs Virat Kohli

Abhishek Sharma Joins Virat Kohli T20 Centuries List: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. గురువారం రాత్రి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో విధ్వంసక సెంచరీతో చెలరేగిన అభిషేక్.. తన టీ20 కెరీర్‌లో పదో శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

అభిషేక్ శర్మ ఇప్పటివరకు టీ20ల్లో 10 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో మూడు శతకాలు టీమిండియా తరఫున చేయగా.. రెండు సెంచరీలు ఐపీఎల్‌లో సాధించాడు. మిగిలిన సెంచరీలు ఇతర టీ20 టోర్నీల్లో వచ్చాయి. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా మొత్తంగా 10 టీ20 శతకాలు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఐపీఎల్‌లో, ఒకటి టీమిండియా తరఫున సాధించాడు. అభిషేక్ కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10 టీ20 సెంచరీలు పూర్తి చేయడం విశేషం. కెరీర్ మొదలెట్టి రెండేళ్లే అయినా అప్పుడే 10 శతకాలు చేయడం విశేషం. అభిషేక్ ఓపెనర్‌గా ఆడుతుండడం అతడికి కలిసొచ్చే అంశం. విరాట్ 2008లో కెరీర్ ఆరంభించినా.. ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత కారణంగా కొన్నిసార్లు దూకుడుగా ఆడడం కుదరదు. అయినా కూడా కింగ్ ఖాతాలో 10 సెంచరీలు అంటే మాటలు కాదు.

టీ20 ఫార్మాట్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో అభిషేక్ శర్మ చోటు సంపాదించాడు. ఈ ఘనతను ఇంత వేగంగా సాధించిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు. గేల్ కేవలం 126 ఇన్నింగ్స్‌ల్లోనే 10 టీ20 సెంచరీల మార్క్‌ను అందుకున్నాడు. కాటేరమ్మ కొడుకు ఈ మైలురాయిని 205 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. అభిషేక్ తన దూకుడైన బ్యాటింగ్‌తో తక్కువ సమయంలోనే ఈ మైలురాయిని చేరుకోవడం అతని టీ20 కెరీర్‌లో ప్రత్యేక ఘనతగా నిలిచింది. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత సులభం కానప్పటికీ.. అభిషేక్ పవర్ హిట్టింగ్‌తో వరుసగా భారీ స్కోర్లు సాధిస్తూ ఈ రికార్డు జాబితాలోకి దూసుకొచ్చాడు.

భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 సెంచరీల జాబితాలో ప్రస్తుతం అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ తలో 10 శతకాలతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. కేఎల్ రాహుల్, సంజు శాంసన్ చెరో ఎనిమిది టీ20 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ కూడా ఎనిమిది శతకాలతో ఈ జాబితాలో కొనసాగుతున్నాడు. రాహుల్ చేసిన ఎనిమిది సెంచరీల్లో రెండు టీమిండియా తరఫున, ఆరు ఐపీఎల్‌లో వచ్చాయి. సంజు ఎనిమిది శతకాల్లో మూడు భారత్ తరఫున, ఐదు ఐపీఎల్‌లో సాధించాడు. రోహిత్ ఎనిమిది సెంచరీల్లో ఐదు టీమిండియా తరఫున, రెండు ఐపీఎల్‌లో నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై మూడో టీ20లో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్‌తో ఈ రికార్డులు సాధించడం మరింత ప్రత్యేకంగా మారింది.