Site icon NTV Telugu

T20 World Cup: పాకిస్థాన్‌ను ఊరిస్తున్న 1992 ప్రపంచకప్ సెంటిమెంట్

Pakistan

Pakistan

T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్‌కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ సోషల్ మీడియాను ఊదరగొడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Read Also: టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లలో ఆధిపత్యం ఎవరిది?

1992 వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగానే జరిగింది. అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. అప్పటి సెమీస్ రేసుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ చేరుకోగా.. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ మూడు జట్లు సెమీస్ చేరుకోవడం పాకిస్థాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో కూడా ఆతిథ్య ఆస్ట్రేలియా నాకౌట్ చేరకుండానే వెనుదిరగడం వంటి పరిస్థితులు చూస్తుంటే ఫైనల్‌లో ఇంగ్లండ్ లేదా టీమిండియాను ఓడించి పాకిస్థాన్ 1992 ప్రపంచకప్ రిపీట్ చేస్తుందని ఆ జట్టు అభిమానులు సంబరపడుతున్నారు. అప్పుడు కూడా ఒక్క పాయింట్ తేడాతో పాకిస్థాన్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుందని.. ఇప్పుడు కూడా దక్షిణాఫ్రికాకు, పాకిస్థాన్‌కు ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉండటంతో ఆ జట్టును అధిగమించి సెమీస్‌కు వెళ్లడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

Exit mobile version