World Economy in 2023: ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సవివరంగా సమాధానం చెప్పింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి తక్కువగా ఉంటుందని, అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా దిగొస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు లేటెస్ట్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ పేరిట రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఎక్కువ దేశాల్లో జీవన వ్యయ సంక్షోభం నెలకొంటుందని, అయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకునేందుకే ఆయా ఆర్థిక వ్యవస్థలు ప్రాధాన్యత ఇస్తాయని తెలిపింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన ఈ తాజా నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరియు ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. అయితే.. చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం కావటం, జీరో కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయటం వల్ల గ్లోబల్ గ్రోత్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, కరోనా కారణంగా లాజిస్టిక్స్ రంగంలో ఎదురైన సవాళ్లు మరియు భౌగోళిక-రాజకీయ వివాదాలు ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణం. ముఖ్యంగా ఇంధన రంగం మరియు ఆహార పదార్థాల సెక్టార్‌లో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
read more: Indian Rupee: ఇండియన్ కరెన్సీ ఎందుకు పడిపోతోందంటే..
ప్రపంచ ద్రవ్యోల్బణం అనేది భౌగోళికంగా చూస్తే చాలా విస్తృతమైన అంశం. అమెరికా మరియు యూరప్ దేశాల్లో ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే ఆసియా ఖండంలోని పలు దేశాల్లో మాత్రం తక్కువగా ఉంటుంది. IMF రిపోర్ట్ ప్రకారం ప్రపంచ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 2 పాయింట్ 9 శాతానికే పరిమితం కానుంది. ఇది.. అక్టోబర్ నాటి అంచనాలతో పోల్చితే సున్నా పాయింట్ 2 శాతం ఎక్కువే అయినప్పటికీ చారిత్రక సగటు కన్నా చాలా తక్కువ కావటం మర్చిపోకూడని అంశం. 2000 సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు గ్రోత్ యావరేజ్ 3 పాయింట్ 8 శాతమని ఐఎంఎఫ్ వెల్లడించింది.
దేశాల వారీగా వృద్ధి అంచనాలు ఎలా ఉంటాయనేది కూడా ఐఎంఎఫ్ తన నివేదికలో పొందుపరిచింది. 2022లో అమెరికా గ్రోత్ రేట్‌ను 2 శాతంగా అంచనా వేయగా ఈ ఏడాదిలో 1 పాయింట్ 4 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. చైనా వృద్ధి రేటు 2022లో 3 శాతంగా అంచనా వేయగా 2023లో ఏకంగా 5 పాయింట్ 2 శాతానికి పెంచింది. ఇండియా గ్రోత్ రేట్‌ను 6 పాయింట్ 8 శాతం నుంచి 6 పాయింట్ 1 శాతానికి కుదించింది. 2024లో మాత్రం తిరిగి 6 పాయింట్ 8 శాతానికి చేరుతుందని తెలిపింది.
పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా వృద్ధి రేటును గతేడాది మైనస్ 2 పాయింట్ 2 శాతంగానే అంచనా వేశారు. ఈ సంవత్సరం మాత్రం అది మైనస్ నుంచి ప్లస్‌లోకి వస్తుందని ఐఎంఎఫ్ ఆశాభావం వెలిబుచ్చింది. రష్యా గ్రోత్ రేట్ 2023లో సున్నా పాయింట్ 3 శాతం ఉంటుందని జోష్యం చెప్పింది. యూరోపియన్ దేశాల ఉమ్మడి వృద్ధి రేటును పోయినేడాది 3 పాయింట్ 5 శాతంగా పేర్కొనగా ఈసారి సున్నా పాయింట్ 7 శాతానికి కోత పెట్టింది. బ్రిటన్ గ్రోత్ రేట్ కిందటి సంవత్సరం 4 పాయింట్ 1 శాతంగా ఉంటుందని లెక్కించగా ఈ ఏడాది ఘోరంగా మైనస్ సున్నా పాయింట్ 6 శాతానికి పరిమితం చేసింది.
ఈ రేంజ్‌లో వృద్ధి రేటు పడిపోనున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ తప్ప మరొక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ద్రవ్యోల్బణం 2022లో 8 పాయింట్ 8 శాతానికి చేరగా 2023లో 6 పాయింట్ 6 శాతానికి దిగొస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2024లో 4 పాయింట్ 3 శాతానికి పడిపోతుందని పేర్కొంది. ఈ సంవత్సరం వరల్డ్ ఇన్‌ఫ్లేషన్ 2 పాయింట్ 2 శాతం తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ ఇది కరోనా ముందు నాటితో పోల్చితే ఎక్కువే అనేది గమనించాల్సిన అంశం. 2017-19 మధ్య కాలంలో ప్రపంచ ద్రవ్యోల్బణం 3 పాయింట్ 5 శాతం మాత్రమే కావటం విశేషం.
మొత్తమ్మీద.. ప్రపంచంలోని 84 శాతం దేశాల్లో ఈ సంవత్సరం వినియోగదారుల ధర సూచీ తక్కువగానే ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోతుండటంతో ఇప్పటికే ఇంధన, ఇంధనేతర సరుకుల ధరలు తగ్గుతుండటం ఐఎంఎఫ్ రిపోర్టును పాక్షికంగా ప్రతిబింబిస్తోంది. కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానంలో కాస్త సడలింపులు ఇస్తుండటం, ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై కనిపిస్తుండటాన్ని సైతం ఈ నివేదిక పట్టిచూపుతోంది. ద్రవ్యోల్బణం తగ్గటం వల్ల కలిగే ప్రయోజనాలను పరిరక్షించుకోవాలంటే ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్లు పెంచాలని ఐఎంఎఫ్ సూచించింది.