(మే 16న సుద్దాల అశోక్ తేజ పుట్టినరోజు)
తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే వందలాది పాటలు రాసి, పరవశింపచేసిన సుద్దాల అశోక్ తేజ కలం ఇప్పటికీ బలంగానే సాగుతోంది. ‘ఠాగూర్’ సినిమాలో అశోక్ తేజ కలం పలికించిన “నేను సైతం… ” అంటూ సాగే పాటకు జాతీయ స్థాయిలో పట్టాభిషేకం జరిగింది.
తండ్రి హనుమంతు పాటతోనే అశోక్ తేజ బతుకు బాట కూడా సాగింది. చదువుతో పాటు లోకాన్నీ చదవగలిగే శక్తి తండ్రివల్లే లభించింది అంటారు అశోక్ తేజ. బడిపంతులుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే, తన మనోభావాలను పాటల రూపంలో పదిలపరచుకొనేవారు అశోక్ తేజ. ఆయన అక్క కుమారుడు ఉత్తేజ్ నటునిగా చిత్రసీమలో కొనసాగుతూ ఉన్నారు. ఉత్తేజ్ తన మేనమామను దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేశారు. సుద్దాల అశోక్ తేజలోని కవిత్వం కృష్ణవంశీకి భలేగా నచ్చేసింది. తన రెండో సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’లో తొలిసారి అశోక్ తేజతో పాట రాయించుకున్నారు కృష్ణవంశీ. ఆ తరువాత నుంచీ అశోక్ తేజను కృష్ణవంశీ ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే తీరున దాసరి నారాయణరావు కూడా తన సినిమాలలో సుద్దాల పాటకు చోటు కల్పిస్తూ సాగారు. వీరి ప్రోత్సాహంతో సుద్దాల అశోక్ తేజ తనదైన బాణీ పలికించారు. అశోక్ తేజ సాహిత్యంలోని గుబాళింపు పలువురిని ఆకట్టుకుంది. అలా అందరి ప్రోత్సాహంతో సుద్దాల పాట చిత్రసీమలో చిందులు వేసింది. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గేయరచయితగా నిలచిన తెలుగువారు సుద్దాల అశోక్ తేజ.
సుద్దాల అశోక్ తేజ పాటల్లో సహజత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. అదే పనిగా కవిత్వం పలికించినట్టు అనిపించదు. అలతి అలతి పదాలతోనే మనసులను తాకే రచన సాగించడం సుద్దాల అశోక్ తేజ బాణీ అని చెప్పవచ్చు. ఆయన రాసిన అనేక గీతాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. ఈ మధ్య కాలంలో అశోక్ తేజ ‘ఫిదా’లో రాసిన “వచ్చిండే… పిల్లా మెల్లగా వచ్చిండే…” పాట విశేషాదరణ చూరగొంది. రాజమౌళి రాబోయే చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’లోనూ సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు పలికించారు. ఆ సినిమాకై తెలుగువారే కాదు, తెలుగు సినిమాలను అభిమానించే ఇతర భాషలవారు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో సుద్దాల పాటలు ఏ తీరున అలరిస్తాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. పైగా ఇందులో యన్టీఆర్ కేరెక్టర్ కొమరం భీమ్ ను పోలి ఉంటుందట! అంటే తెలంగాణ పలుకుబడికి కొరతేలేదు. కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్.’లోనూ సుద్దాల అశోక్ తేజ పాటలు పరవశింపచేస్తాయని ఆశించవచ్చు.