Sankranti: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను అంగరంగ వైభంగా జరుపుకుంటారు. నిజానికి సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఏయే రాష్ట్రాల్లో ఏ పేర్లతో .. ఎలాంటి ఆచారాలతో, పద్దతులతో ఈ ప్రముఖ పండగను ప్రజలు జరుపుకుంటారో ఈ స్టోరీలో చూద్దాం.
READ ALSO: Cockfight: కోడి పందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న రాజమండ్రి వాసి..
తెలుగు రాష్ట్రాల్లో..
సంక్రాంతి పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ. ఈ పండగ రోజు తెలంగాణలో సకినాలు, మురుకులు వంటి పిండి వంటలు చేస్తారు. ఆంధ్రాలో జంతికలు, సున్నుండలు, గారెలు, కజ్జికాయలు వంటి రకరకాల పిండి వంటలు చేస్తారు. గాలి పటాలు ఎగరవేస్తూ, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతారు. రంగు రంగుల ముగ్గులు, వాటిపై పెట్టే గొబ్బెమ్మలతో పండగ కల అంతా ఇంటి ముందే కనిపిస్తుంది. ఇదే టైంలో ఆంధ్రాలో కోడిపందాలు ఫుల్ జోష్‌లో నడుస్తాయి..
పంజాబ్, కశ్మీర్‌లో: మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఈ సంక్రాంతి పండగను పంజాబ్ లోహ్రి పండుగగా నిర్వహించుకుంటారు. పంజాబ్‌లో భోగి రోజున మంటల్లో చెరకు గడలు, మిఠాయిలు, బియ్యం వేసి, ఆ మంటల చుట్టూ బాంగ్రా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి రోజున నదీ స్నానం ఆచరించి.. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఖీర్, పాప్‌కార్న్‌ను నైవేథ్యంగా పెడుతారు. పవన్ యజ్ఞాస్ పేరుతో కశ్మీర్‌లో భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి రోజున నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి చేసే పదార్థాల్ని దేవతలకు నైవేథ్యంగా సమర్పిస్తారు.
కేరళ: సంక్రాంతి పర్వదినం రోజున మకర విళక్కును కేరళ ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా కేరళలో అవియల్ కూర ఫేమస్. దూరప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఈ రోజున వస్తారు. అలాగే కేరళలో ఈ పండగ రోజున కొబ్బరితోటల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు జరిగిన అనంతరం మిఠాయిలు పంచి పెడతారు.
తమిళనాడు: సంక్రాంతి పండుగను తమిళనాడులో నాలుగు రోజులు జరుపుకుంటారు. ఈ రాష్ట్రంలో మన సంక్రాంతిని పొంగల్‌గా నిర్వహించుకుంటారు. రెండో రోజున థై పొంగల్‌ను సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతి రోజున కొత్త పాత్రలో పాత బియ్యం, బెల్లం, పాలు కలిపి పొయ్యిమీద పొంగించి, ఆ తర్వాత నైవేథ్యం చేసి, సూర్యుడికి నైవేథ్యంగా సమర్పిస్తారు.
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సంక్రాంతి పండగను పోష్ సంక్రాంతిగా నిర్వహిస్తారు. ఈ రాష్ట్రంలో పండగ రోజున సంప్రదాయ వంటకమైన పతిషప్తాను చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లో చేసే ఈ పతిషప్తా రెండు రకాల్లో ప్రజల నోరూరిస్తుంది.
మధ్యప్రదేశ్: సంక్రాంతి పండగను మధ్యప్రదేశ్‌లో సుఖరాత్‌గా జరుపుకుంటారు. పండగ రోజున తెల్లవారుజామునే స్నానం చేసి గోవులను పూజిస్తారు. కొత్త పంటల్ని ఇంటికి తీసుకొచ్చి పిండి వంటలు చేసి దేవునికి నైవేథ్యంగా సమర్పిస్తారు. మధ్యప్రదేశ్‌లో పండగ రోజున రకరకాల స్వీట్స్‌ను ఇచ్చిపుచ్చుకోవడం ఈ రాష్ట్రంలో ప్రత్యేకత.
మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలో నిర్వహించే సంక్రాంతిని ఇదే పేరుతో నిర్వహిస్తారు. ఈ రాష్ట్రంలో తిల్‌గుల్ పేరుతో నువ్వులతో చేసిన రంగురంగుల హల్వాను తయారు చేసుకుంటారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు పసుపు కుంకుమ, తాంబూలాలతో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సంప్రదాయాన్ని హల్ధీకుంకుమ్ అంటారు. మహారాష్ట్రలో పండగ రోజున పూరన్ పోలీలు అనే వంటకాన్ని తయారు చేస్తారు. ఇవి భక్ష్యాల వలే ఉంటాయి. బెల్లంతో శెనగపప్పు వేసిన పుర్ణాన్ని రుబ్బుకుని మైదాలోపల స్టఫ్ చేసి చపాతీలా వత్తి చేసే పూరన్ పోలీలను మహారాష్ట్రలో సంక్రాంతికి వండుకుంటారు.
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను కిచెరీ పేరుతో నిర్వహించుకుంటారు. సరస్వతి, గంగ, యమున నదీ సంగమమైన అలహాబాద్‌కు పండగ రోజున వేల సంఖ్యలో జనాలు వచ్చి నదీ స్నానాలు ఆచరిస్తారు. పండగ సందర్భంగా మిఠాయిలు, పిండి వంటలు చేసుకొని బంధువర్గాలకు పంచి పెడతారు.
కర్ణాటక, ఒడిశా, అసోం, ఢిల్లీ, జార్ఖండ్, హర్యానా, బిహార్‌లలో, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారు.
READ ALSO: Gold Silver Rates: బంగారం ‘భగభగ’.. వెండి ‘ధగధగ’! రికార్డు ధరల వేళ ఇప్పుడు కొనడం రిస్కేనా?