Yendira Ee Panchayithi Movie Review: విలేజ్ లవ్ స్టోరీలకు, ఆ ఊరి చుట్టూనే తిరుగుతున్న కథలకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి సమాయంలో అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాగా ఏందిరా ఈ పంచాయితీ అనే సినిమా తెరకెక్కింది. భరత్, విషికా లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ నిర్మించిన ఈ ఏందిరా ఈ పంచాయితీ సినిమాతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎన్నో సినిమాలతో పోటీ పడుతూ ఈ సినిమా ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది. అలాంటి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
ఏందిరా ఈ పంచాయితీ కథ:
చిత్తూరు జిల్లాలోని రామాపురం అనే చిన్న గ్రామంలో అభి తన ఇద్దరి స్నేహితులతో కలిసి జేబు ఖర్చుల కోసం చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే ఊరంతా ఏకమై ఎస్సై కావాలని ప్రయత్నిస్తున్న అభినే ఆ దొంగల పని పట్టమని కోరతారు. ఈ క్రమంలో ఊరి పెద్ద(కాశీ విశ్వనాధ్) కూతురు యమున (విషిక)తో లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఆమె కూడా అభిని లవ్ చేస్తుంది. అయితే అభి ఒక మర్డర్ చేశాడని భావించి ఆమె మరో పెళ్ళికి సిద్ధం కావడంతో హీరోయిన్ తండ్రిని చంపబోయి అభి అరెస్ట్ అవుతాడు. ఇక అదే సమయంలో ఊర్లో ప్రెసిడెంట్(తోటి మధు), వార్డ్ మెంబర్ సుధాకర్ రెడ్డి(రవి వర్మ) అనుమానాస్పద మృతిలో చనిపోతారు. ఆ కేసులో కూడా అభి హస్తం ఉందని పోలీసులకు తెలుస్తుంది, నిజంగానే అభి వారిని చంపాడా? అసలు ఆ ఇద్దరినీ చంపింది ఎవరు? ఈ హత్యలకు అసలు కారణం ఏమిటి? చివరకు ఈ పంచాయితీ ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా కథ కొత్తదా? అంటే అస్సలు కాదు. ఇలాంటి సినిమాలు మనం గతంలో ఎన్నో చూశాం. ఊరిలో గాలికి తిరిగే యువకుడు పట్నం నుంచి అప్పుడే ఊరికి వచ్చిన అమ్మాయిని ప్రేమించడం, ఆమెను తిరిగి ప్రేమించేలా చేయడం పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. వారు ప్రేమలో పడి శారీరికంగా కూడా ఒక్కటయ్యాక అతను ఒక దొంగ అని, హత్య చేశాడని తెలిసి దూరంగా ఉంచితే ఏకంగా హీరోయిన్ తండ్రినే చంపాలని చూడ్డం మాత్రం కొంచెం భిన్నం అనిపించింది. సస్పెన్స్ అనిపించకపోయినా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు మాత్రం భలే ఆసక్తి రేకెత్తిస్తాయి. బోర్ కొట్టించని సన్నివేశాలతో సినిమాను ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన దర్శకుడు గంగాధర నిడివి విషయంలో కేసుల జాగ్రత్తపడ్డాడు. మరీముఖ్యంగా పోలీసులు హీరోను అరెస్ట్ చేయడం ఆ తరువాత ఆటను బయటకు వచ్చి కేసులు సాల్వ్ చేసే కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని స్నేహితులు చేసే చిల్లర దొంగతనాలు, అల్లరి పనులతో సరదాగా సాగుతుంది. హీరో హీరోయిన్ల రొమాన్స్ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. సెకండాఫ్ అంతా కేస్ సాల్వ్ చేసే వ్యవహారంలో ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తుంది. నిడివి తక్కువే అయినా ఇంకా కొంచెం సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే ముందుగా నటీనటుల విషయానికి వస్తే అభి పాత్రలో భరత్ కొత్తవాడే అయినా సరిగ్గా సూట్ అయ్యాడు. పాఅన్ని యాంగిల్స్ లో తన టాలెంట్ చూపే ప్రయత్నం చేశాడు. విషిక పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కాశీ విశ్వనాథ్, రవి వర్మ, తోట మధు, సాగర్ ప్రేమ్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్‌గా చెప్పాలంటే కెమెరా వర్క్ ఆ ఊరిని మరింత అందంగా చూపించడంలో బాగా ఉపయోగపడింది. డైలాగ్స్ చాలా సహజంగా అనిపించాయి. పాటలు కూడా విజువల్ గా బాగున్నాయి. ఎడిటర్ జేపీ క్రిస్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. కొత్త నిర్మాత ప్రదీప్ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ: ఏందిరా ఈ పంచాయితీ ఒక విలేజ్ లవ్ స్టోరీ.. ఊహించని ట్విస్టులు అలరిస్తాయి.