NTV Telugu Site icon

Laththi Movie Review: లాఠీ ఛార్జ్

Vishal Min

Vishal Min

Laththi Movie Review:  గత కొంతకాలంగా హిట్ కోసం ముఖం వాచి ఉన్నాడు విశాల్. ఇటీవల కాలంలో తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బాల్చీ తన్నేస్తున్నాయి. దాంతో తమిళనాటనే కాదు తెలుగునాట కూడా విశాల్ మార్కెట్ బాగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘లాఠీ’. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా యాక్షన్ సినిమాలు చేసుకుంటూ పోతున్న విశాల్ తమిళంలో రూపొందించి తెలుగులో డబ్ చేసినన ఈ యాక్షన్ థ్రిల్లర్ గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

కథకి వస్తే మురళీకృష్ణ (విశాల్) నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్. ఓ కేసులో నిందితుడికి ‘లాఠీ’తో ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు సంవత్సరకాలం సస్పెండ్ అవుతాడు. తన నిజాయితీ కారణంగా ఓ అధికారి సాయంతో డిఐజి సిఫార్సుతో మళ్ళీ ఉద్యోగం పొందుతాడు. ఇకపై ‘లాఠీ’తో నిందుతులను దండించను అని భీష్మించుకున్న మురళి తను ఉద్యోగం మళ్ళీ పొందటానికి కారకుడైన డీఐజి కోసం వీర అనే నేరస్థుడిని లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. దాని కారణంగా అతని కుటుంబానికి ప్రమాదం ఎదురవుతుంది. మరి దానినుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? తన కుమారుడుని ఎలా కాపాడుకున్నాడన్నదే కథాంశం.

‘పందెంకోడి’లో తర్వాత వరుసగా యాక్షన్ చిత్రాలను చేస్తూ వచ్చిన విశాల్ మధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలను చేసినప్పటికీ వాటిలోనూ యాక్షన్ పాలు ఎక్కువగానే ఉంటూ వచ్చింది. వయసు కారణంగానో, ఇతర దురలవాట్ల వల్లో ఏమో కానీ ఇటీవల కాలంలో విశాల్ తన రూపురేఖల్ని కోల్పోయాడు. ఇంకా పెళ్ళి కాకున్నా బాగా వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇక ‘లాఠీ’లో యాక్షన్ తో పాటు తండ్రీకొడుకుల అనుబంధం కూడా ఉంది. నటీనటుల విషయానికి వస్తే మురళీకృష్ణగా విశాల్ యాక్షన్ సీన్స్ లో పరవాలేదని పించినా, పతాక సన్నివేశంలో చేసిన ఎమోషనల్ యాక్ట్ నవ్వు తెప్పించేదిగానే కాదు చికాకు తెప్పిస్తుంది. విశాల్ భార్యగా సునైనా పాత్ర చిన్నదే. ఇక కొడుకుగా నటించిన మాస్టర్ లిరిష్ రాఘవ నటన బాగుంది. విలన్ వీరాగా నిర్మాత రమణ అంతగా నప్పలేదు. ఇక సుర పాత్రలో నటించిన నటుడులో హావభావాలు నిల్. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఎవరి పనితనం గురించి అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

80లలో వచ్చిన యాక్షన్ సినిమాలకు ఏ మాత్ర తగ్గని రీతిలో ఒక హీరో, వందమంది రౌడీలను తుక్కు రేగ్గొట్టడం ఇందులోనూ ఉంది. కాకుంటే అప్పట్లో హీరో క్రాఫ్, బట్టలు నలిగేవి కాదు. ఇందులో హీరోకి వల్లంతా గాయాలు ఉంటాయి. విలన్స్ కత్తులతో, రాడ్లతో దాడి చేసి హీరోని కొట్టినా తను మాత్రం లాఠీ కర్రతోనే అంత మంది రౌడీలను చంపేస్తాడు. సినిమానా మాజాకా! ఈ కాలంలోనూ ఆడియన్స్ ను అలవికాని  హీరోయిజంతో ఆకట్టుకోవాలని చూసిన హీరో విశాల్, దర్శకుడు వినోద్ ని చూస్తుంటే జాలి కలగక మానదు. సక్సెస్ లు లేక చిప్ దొబ్బినట్లు అనిపిస్తుంది. ప్రత్యేకించి పతాక సన్నివేశాల్లో యాక్షన్ ఫైట్ లెంగ్తీగా సాగుతూ విశాల్ లాఠీతో ప్రేక్షకులను చితక్కొట్టినట్లే అనిపిస్తుంది.

రేటింగ్: 2.25/ 5

ప్లస్ పాయింట్స్
పోలీస్ కథ కావటం

మైనస్ పాయింట్స్
కథ, కథనం
లాజిక్ లేని సన్నివేశాలు
సాగదీసిన క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: ప్రేక్షకులపై ‘లాఠీ’ ఛార్జ్