Gautam Gambhir: టీమ్ ఇండియా, గౌతమ్ గంభీర్‌కు 2025 సంవత్సరం కలసిరాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ ఆసియా కప్ (టీ20లు), ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) గెలిచింది. మరోవైపు టెస్టు క్రికెట్‌లో మాత్రం భారీ పరాజయాలను ఎదుర్కొంది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా భారత్‌ను స్వదేశంలోనే 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 2024లో గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత్ న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో 3-0తో ఓడిపోయింది.
READ MORE: Roshan Meka : ఒక్క హిట్‌తో ఇద్దరు బడా నిర్మాతల దృష్టిలో పడ్డ రోషన్..
ఈ వరుస పరాజయాలు గంభీర్ టెస్టు కోచ్‌గా సామర్థ్యంపై పెద్ద ప్రశ్నలు తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థ ఒక నివేదికను ప్రచురించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిన తర్వాత, క్రికెట్ బోర్డులో కీలక వ్యక్తి ఒకరు వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించి, రెడ్ బాల్ జట్టు కోచ్ బాధ్యతలపై ఆసక్తి ఉందా అని అడిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ‘హెడ్ ఆఫ్ క్రికెట్’గా ఉన్న ప్రస్తుత బాధ్యతలతో లక్ష్మణ్ సంతృప్తిగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. అయితే.. ఓ సీనియర్ బీసీసీఐ అధికారి ఈ అంశంపై స్పందించారు. “మేము వీవీఎస్ లక్ష్మణ్‌తో అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ మాట్లాడలేదు. గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు” అని తెలిపారు. అయితే భారత క్రికెట్‌లో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం. టీ20 వరల్డ్ కప్‌కు ముందు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పిస్తారని ఎవరు ఊహించ లేదు? పీటీఐ నివేదిక ప్రకారం.. గంభీర్ ఒప్పందం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ.. ఐదు వారాల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ఫలితాలపై ఆధారపడి ఆ ఒప్పందాన్ని తిరిగి సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.