సోషల్ మీడియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సోషల్ మీడియా ఒక పక్క మంచికి మరోపక్క చెడుకు కూడా బాగా ఉపయోగపడుతోంది. ఇక ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని #వైరల్ ప్రపంచం అనే సినిమా తెరకెక్కింది. రెండు జంటలు.. సోషల్ మీడియా వేదికగా సాగించిన ప్రేమాయణం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? వారు చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న వీడియోలు.. వెబ్ మార్కెట్ లో ఎలా లీకయ్యాయి? అలా లీక్ అవడం వల్ల వాళ్ల జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి అనే స్టోరీతో డైరెక్టర్ బ్రిజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మార్చ్ 7న రిలీజ్ అయింది. అయితే అంతకు ముందుగానే తన్వీర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. అంతేకాదు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్, మాంట్రియల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ మూవీని ప్రదర్శించగా ప్రశంసలు దక్కించుకుంది. సాయి రోనక్, దేవుళ్ళు ఫేమ్ నిత్యా శెట్టి వంటి వారు నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
అమెరికాకు వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ) రవి (సాయి రోనక్)తో ప్రేమలో ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ లవ్ ను ఏ విధంగానైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోపక్క అదితి (నిత్యశెట్టి) సోషల్ మీడియాలో పరిచయమైన ప్రవీణ్ (సన్నీ నవీన్)తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ఇద్దరూ తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను, ఇంటర్నెట్‌ను నమ్ముతారు. అయితే వారి నమ్మకాన్ని దెబ్బకొట్టేలా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఆ పరిస్థితులు ఏంటి? ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితులు ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : ఇంటర్నెట్ ఇప్పుడు ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేసింది. ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేయడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో? అంతకు మించిన నష్టాలూ ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ప్రేమలు ఆన్ లైన్ లో పుడుతుండగా ఫోన్ రొమాన్స్, వీడియో కాల్ రొమాన్స్ సర్వ సాధారణం అయింది. అలాంటి వాటిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఒక అమ్మాయి భవనంపై నుండి దూకడంతో మొదలయ్యే ఈ సినిమా మొత్తం కంప్యూటర్ స్క్రీన్‌లు, వరుస వీడియో కాల్స్, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసెస్‌ల ద్వారా ఆలోచింప చేసేలా సాగుతుంది. వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా బలపడుతున్నాయి? అవి ఎలా విడిపోతున్నాయి అనేవి డిస్కస్ చేసిన తీరు బాగుంది. ఇలాంటి కోవలోనే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా కొత్తదనం లేకున్నా ఆన్ లైన్ లవ్ అంటే భీతి గొలిపేలా రాసుకున్నారు. ఒకపక్క రియాలిటీకి దగ్గరగా ఉంది అని అనిపిస్తూనే మరొక పక్క ఆలోచనలో పడేస్తూ సాగిన సినిమా కొంత సాగతీసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలు అయ్యాక కథనంలో వేగం పెరుగుతుంది. ‘ఇంటర్నెట్‌లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అని ఈ సినిమాలో ఓ డైలాగ్ మాదిరిగానే సినిమా కథ రియాలిటీకి దగ్గరగా ఉంది. వీడియో కాల్స్, వాటిని స్క్రీన్ రికార్డింగ్ చేయడం వల్ల కొన్ని జీవితాలు ఎలా మారిపోయాయి అనేది ఈనాటి యూత్ ఆలోచనలో పడేలా ఈ కధ రాసుకున్నారు.
నటీనటుల విషయాన్ని వస్తే ఈ సినిమాలో రెండు జంటలు ఉన్నాయి. రవి పాత్రలో సాయి రోనక్, స్వప్న పాత్రలో ప్రియాంక శర్మ, అదితి పాత్రలో నిత్యశెట్టి, ప్రవీణ్ పాత్రలో సన్నీ నవీన్ నేటి యూత్ పాత్రలలో సరిగ్గా ఇమిడిపోయారు. ఒక పక్క ప్రేమను చూపిస్తూనే చిక్కులలో పడ్డాక వారి భావోద్వేగాలను పండించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే కనుక ముందుగా మాట్లాడుకోవాల్సింది సంగీతం గురించి. ఉన్న కొన్ని సాంగ్స్ తో పాటు నేపధ్య సంగీతమ్ కూడా బాగా కుదిరింది. ఎడిటింగ్ కూడా సరిగా కుదిరింది కానీ ఇంకా ట్రిమ్ చేయచ్చు. కెమెరా పనితనం కొన్ని ఫ్రేమ్స్ లో బాగా కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ ఈ వైరల్ ప్రపంచం యూత్ చేసే తప్పులు చూపిస్తూ ఆలోచింప చేసే సినిమా.