ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథను అల్లి, దాదాపు రెండు గంటలపాటు వ్యూవర్స్ ను కట్టిపడేయడం అంత సులభం కాదు! కానీ అలాంటి పనిని ధైర్యంగా చేసేశారు దర్శక నిర్మాతలు ఎస్. కార్తీక్, బూసం జగన్ మోహన్ రెడ్డి. వీళ్ళు తీసిన ‘విందు భోజనం’ మూవీ ప్రస్తుతం ఎమ్మెక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది.
కథగా చెప్పుకోవాలంటే చిన్నదే. షెఫ్ కావాలనుకునే ఆదిత్య (అఖిల్ రాజ్) కథ ఇది. కానీ అతనిది మాత్రమే కాదు… అతను అన్నగా భావించే ఆనంద్ (సిద్ధార్థ్ గొల్లపూడి)ది కూడా. తండ్రితో కలిసి ఆనంద్ ‘విందు భోజనం’ అనే రెస్టారెంట్ ను ప్రారంభిస్తాడు. కొద్ది రోజులకే తండ్రి హఠాన్మరణం చెందడంతో రెస్టారెంట్ నిర్వహణ భారం ఆనంద్ మీద పడుతుంది. అందులో ఆదిత్య షెఫ్ గా చేరతాడు. రెస్టారెంట్ మేనేజర్ రాజు (హర్షవర్థన్) మేనకోడలు పూర్వ (ఐశ్వర్య) తన బాండ్ తో ఇదే రెస్టారెంట్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంటుంది. సింగింగ్ అంటే ఆసక్తి ఉన్న ఆదిత్య ఆమెతో ప్రేమలో పడతాడు. కథ ఇలా సాగుతుండగా… ఆనంద్ తండ్రి రెండో భార్య (అనితా చౌదరి) కొడుకు వివేక్ (అభిషేక్ దొడ్డేపల్లి) రెస్టారెంట్ లో తనకూ వాటా ఉందని, దాన్ని అమ్మేసి, తన డబ్బులు తనకివ్వమని గొడవకు దిగుతాడు. రెస్టారెంట్ ను ప్రాణంగా భావించే ఆనంద్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆనంద్ కు చేదోడు వాదోడుగా నిలిచే ఆదిత్య ఈ విషయంలో అతనికి ఎలా బాసటగా నిలిచాడు? మధ్యే మార్గంగా ఏర్పాటు చేసుకున్న డీల్ లో ఆనంద్ బృందం ఎలా విజయం సాధించింది? అన్నదే మిగతా కథ.
మధ్య తరగతి మనుషులు, వాళ్ళకు ఉండే అర్థం లేని పట్టింపులు, ఇగోతో ఎదురయ్యే సమస్యలు… వాటిని ఎదుర్కోవడానికి ఎదుటివాళ్ళు చేసే ప్రయత్నాలు… వీటితోనే ఈ కథంతా సాగుతుంది. అందరిలా టెన్ టూ సిక్స్ రొటీన్ జాబ్ చేయడానికి ఇష్టపడని ఓ కుర్రాడు షెఫ్ గా మారడం, ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన చిన్న చిన్న సమస్యలు, తాతయ్య సాయంతో వాటిని అధిగమించడం బాగుంది. అలానే తాను ప్రేమించిన అమ్మాయి తల్లికి వంట నేర్పించి, ఆమె భర్త దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి అతను సహకరించే సన్నివేశాలూ సరదాగా ఉన్నాయి. బట్ థియేటర్ లో ఆడియెన్స్ ను కట్టిపడేసే కంటెంట్ కాదిది. సరదాగా ఓ సాయంత్రం పూట ఇంట్లో కూర్చుని గంట నలభై ఐదు నిమిషాలు మనది కాదనుకుని ఎంజాయ్ చేసేది. ఆ విషయం తెలిసే కావచ్చు… ఎలాంటి భేషజాలకూ పోకుండా ఎమ్మెక్స్ ప్లేయర్ కు తమ సినిమాను అప్పగించేశారు దర్శక నిర్మాతలు.
అఖిల్ రాజ్, ఐశ్వర్య జంట చూడచక్కగా ఉంది. సిద్దార్థ్ గొల్లపూడి నటన బాగుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అభిషేక్ సెటిల్డ్ పెర్ఫార్మ్స్ తో అదరగొట్టాడు. హర్షవర్థన్, అనితా చౌదరి, వీరభద్రమ్, ఆశ్రిత వేముగంటి, కేశవ దీపక్, అంబడిపూడి మురళీకృష్ణ… వీళ్ళంతా వెండితెరపై తమదైన ప్రభావాన్ని కొంతకాలంగా చూపుతున్నవారే. తమ పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. అయితే వీరు ఎక్కడా హద్దులు మీరి నటించకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడనిపిస్తుంది. పాటల సాహిత్యం, బాణీలు, నేపథ్య సంగీతం హాయిగా ఉన్నాయి. అజయ్ నాగ్, దేవ్ దీప్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. స్పాట్ రికార్డింగ్ వల్ల కావచ్చు… కొన్ని పదాలలో స్పష్టత లోపించింది. ఆడియోలోనూ అప్ అండ్ డౌన్స్ బాగా ఉన్నాయి. ఇది వీక్షకులకు సంపూర్ణమైన ‘విందుభోజనం’ అని చెప్పలేం కానీ సరదాగా ఓసారైతే చూసేయొచ్చు. ఊహకందని ట్విస్టులేవో ఉంటాయని ఆశపడితే మాత్రం కొంత నిరాశకు గురికాక తప్పదు.
రేటింగ్: 2.75 / 5
ప్లస్ పాయింట్స్
ఫ్రెష్ పాయింట్
కూల్ నెరేషన్
యాక్టర్స్ పెర్ఫార్మెన్స్
మైనెస్ పాయింట్స్
సింపుల్ స్టోరీ కావడం
మలుపులు, మెరుపులు లేకపోవడం
ట్యాగ్ లైన్: స్వీట్ అండ్ సింపుల్!