NTV Telugu Site icon

Vettaiyan Movie Review: రజనీకాంత్ వేట్టయన్ రివ్యూ

Vettaiyan Movie Review

Vettaiyan Movie Review

న‌టీన‌టులు: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్ త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ సుభాస్కర‌న్‌,
ద‌ర్శ‌క‌త్వం: టి.జె.జ్ఞాన‌వేల్‌,
మ్యూజిక్‌: అనిరుద్ ర‌విచంద‌ర్‌,
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.ఆర్‌.క‌దిర్‌,
ఎడిట‌ర్‌: ఫిలోమిన్ రాజ్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కె.క‌దిర్‌,
యాక్ష‌న్‌: అన్బ‌రివు,
కొరియోగ్ర‌ఫీ: దినేష్‌,
పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ఆయన వేట్టయన్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. తెలుగులో వేటగాడు అని అర్థం వచ్చేలా తెరకెక్కిన ఈ సినిమాలో మన తెలుగు హీరో రానా విలన్ పాత్రలో నటించాడు దానికి తోడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక మంజు వారియర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో దుషారా విజయన్, రితికా సింగ్, రావు రమేష్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

వేట్టయన్ కథ:
కన్యాకుమారి జిల్లా ఎస్పీ(రజనీకాంత్) కి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు ఉంది. అయితే తన స్కూల్లో గంజాయి వ్యవహారం గురించి ఎస్పీ దృష్టికి తీసుకు వచ్చి, బట్టబయలు చేసిన శరణ్య (దుషరా విజయన్) అనూహ్య పరిస్థితుల్లో మృత్యువాత పడుతుంది. ఆమె కేసును పర్సనల్గా తీసుకున్న ఎస్పీ ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న గుణను ఎన్కౌంటర్లో చంపేస్తాడు. అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిన సత్యదేవ్ (అమితాబచ్చన్) వచ్చే జరిగిన సమయంలో అసలు గుణ హత్య జరిగిన ప్రాంతంలోనే లేడని చెబుతాడు. అయితే శరణ్యను చంపింది ఎవరు? గుణను చంపి తప్పు చేశానని తెలుసుకున్న ఎస్పీ ఏం చేశాడు? అసలు శరణ్య మర్డర్లో నటరాజన్(రానా) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా కథ కొత్తది అని చెప్పలేం. ఎందుకంటే గతంలో ఎన్నో సినిమాలలో చూసిన కథనే రజినీకాంత్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడేలా సిద్ధం చేసుకుని తెరకెక్కించినట్లు అనిపించింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన హీరో అనుకోకుండా తప్పుడు ఎన్కౌంటర్ చేయడం, ఆ ఎన్కౌంటర్లో మరణించిన వ్యక్తికి న్యాయం చేయడం కోసం అసలు నిజంగా తప్పు చేసింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాను నడిపించిన తీరు రజనీకాంత్ అభిమానులను ఆనందింప చేసేలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లోనే రజినీకాంత్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. రజనీకాంత్ స్టైల్ ఎలివేషన్ కాకుండా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ఎస్పీ స్థాయి అధికారిగా ఆయన క్యారెక్టర్ న ఎస్టాబ్లిష్ చేసిన తీరు రియాలిటీ దగ్గరగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ అంతా ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కాస్త సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా కథను ఎంగేజింగ్ గా నడిపించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక ముఖ్యంగా ఎమోషనల్ కనెక్టివిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్యారెక్టర్ లను పూర్తిస్థాయిలో డీప్ గా టచ్ చేయకుండానే ప్రేక్షకులను దానికి కనెక్ట్ చేసే విధానం ఆకట్టుకునేలా ఉంది. సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగినా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లే అనిపించాడు. అయితే తమిళం నుంచి తెలుగులోకి కొన్ని డైలాగులను డబ్బు చేసే విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో మరోసారి మెరిశాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీకాంత్ తాను తప్ప ఇంకెవరు ఈ పాత్ర చేయలేరేమో అని అంత ఈజ్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇక అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్వించిన ఫహద్ ఫాజిల్ చివరిలో కన్నీరు పెట్టించాడు. రితికా సింగ్, అభిరామి, రోహిణి ఇలా ఎవరికి వారు తమ పాత్రలను చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. మంజు వారియర్ కనిపించింది తక్కువ సీన్స్ అయినా ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో రజనీకాంత్ అయితే టెక్నికల్ టీం విషయంలో మాత్రం హీరో అనిరుద్ రవిచందర్. మామూలుగానే ఈ మధ్యకాలంలో అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి, పాటలకు మంచి అప్లాజ్ వస్తోంది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనిరుద్ దుమ్ము రేపాడు. ముఖ్యంగా రజినీకాంత్ ని ఎలివేట్ చేసే సీన్స్ కొన్నే ఉన్నా వాటిని తనదైన శైలిలో డబుల్ ఇంపాక్ట్ తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు అనిరుద్. ఇక పాటలు అయితే కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్ అయ్యేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.

ఫైనల్ గా ఈ వేటగాడు.. పండగ బరిలో గట్టిగా వేటాడేలా ఉన్నాడు.