Veeranjaneyulu Viharayatra Review: # 90స్ వెబ్ సిరీస్ తర్వాత ఈటీవీ విన్ తమ ఓటీటీ కంటెంట్ ఎంపిక మీద చాలా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే అసభ్యతకు తావులేని కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వీరాంజనేయులు విహారయాత్ర అనే ఒక ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈటీవీ విన్ యాప్ లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రాగమయుర్, ప్రియా వడ్లమాని, శ్రీలక్ష్మి వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. బ్రహ్మానందం వాయిస్ ఓవర్తో రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
వీరాంజనేయులు విహారయాత్ర కథ:
వీరాంజనేయులు(బ్రహ్మానందం) ఒక రైల్వే ఉద్యోగి. అనుకోకుండా గోవా వెళ్ళిన అతను ఆ ప్రదేశం బాగా నచ్చేసి అక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు. రిటైర్మెంట్ అనంతరం వచ్చిన డబ్బుతో గోవాలో ఇల్లు కొనుగోలు చేసి దానికి హ్యాపీ హోమ్ అని పేరు పెడతాడు. వీరాంజనేయులు మరణం తర్వాత ఇంటి బాధ్యతలు కొడుకు నాగేశ్వరరావు(నరేష్) మీద పడతాయి. నరేష్ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక స్కూల్లో మాథ్స్ టీచరుగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇంగ్లీష్ సరిగా రాని కారణం చెప్పి నాగేశ్వరరావుని స్కూల్ నుంచి తొలగిస్తారు. సరిగ్గా అదే సమయానికి తన కూతురు సరయు( ప్రియా వడ్లమని ) తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కోసం సిద్ధమవుతోంది. అవతలివాళ్లు బాగా ఉన్నవాళ్లు కావడంతో పెళ్లి గ్రాండ్గా చేయాలని కండిషన్ పెడతారు. దీంతో ఉద్యోగం పోయి బాధలో ఉన్న నాగేశ్వరరావు హ్యాపీ హోం అమ్మితే పెళ్లి చేయొచ్చని భావించి తన కుటుంబ సభ్యులందరినీ గోవా తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్న కొడుకు వీరు(రాగ్ మయూర్) ఒక షాకింగ్ విషయం చెబుతాడు. దీంతో అసలు సరయు పెళ్లి అయిందా? సరయు చేసుకోబోయే వాడికి, వీరుకి అసలు గొడవేంటి? నాగేశ్వరరావు అండ్ కో ఇంతకీ ఇల్లు అమ్మారా? కుటుంబంతో గోవా వెళ్లేందుకు నాగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
వీరాంజనేయులు విహారయాత్ర సినిమాని మొదటి నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చిన విధానం ఈ సినిమాకి మైనస్. ఇది ఒక కామెడీ సినిమా అన్నట్టుగా ప్రమోషన్ చేస్తూ వచ్చింది టీం. కానీ సినిమా మొదలైన కాసేపటికి ఇది కామెడీ సినిమా కాదని అన్ని ఎమోషన్స్ తో కూడిన ఒక సినిమా అని అర్థం అయిపోతుంది. ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, ఆ కుటుంబంలోని సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కించారు. కూతురు పెళ్లి కుదిరితే ఆ తండ్రిలో ఉండే కంగారు, ఆ పెళ్లి ఎలా చేయాలి అని ఆలోచించే తండ్రి ఇంటిని అమ్మ ఎందుకు సిద్ధం అవ్వడం , మరోపక్క చేతికి అంది వచ్చాడు అనుకున్న కొడుకు ఇంట్లో చెప్పకుండా బిజినెస్ చేసిన నష్టపోవడం లాంటి అనేక అంశాలతో ఈ సినిమాని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. అయితే కామెడీ సినిమా ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూసేందుకు సిద్ధమైన వారికి ఇది కాస్త అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తుంది. కానీ కూతురు పెళ్లి కోసం ఫ్యామిలీ అంతా కలిసి గోవా బయలుదేరినప్పటి నుంచి కథ కొంచెం వేగం పుంజుకుంటుంది. ఆ తరువాత మిడిల్ క్లాస్ కుటుంబంలో చోటు చేసుకునే సన్నివేశాలు మన అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అన్నీ అని చెప్పలేం కానీ ఏదో ఒక సీన్ లో కనెక్ట్ అవకుండా ఉండలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నటీనటుల విషయానికి వొస్తే ఈ సినిమాలో నరేష్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. తనకు బాగా పరిచయం ఉన్న పాత్రలో కనిపిస్తూ నవ్విస్తూ ఏడిపించేసేలా నటించాడు. ఇక శ్రీలక్ష్మీ తన పాత్రలో ఒదిగిపోయి అనుభవాన్ని చూపెట్టింది. ఇక రాగ్ మయూర్ కి మంచి పాత్ర పడింది. నేటి తరం కుర్రాడి పాత్రలో జీవించాడు. ప్రియా కూడా ఇప్పటివరకు రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రలే ఎక్కువగా చేస్తూ వచ్చింది కానీ ఇందులో మాత్రం కాస్త ఫ్యామిలీ అమ్మాయిలా కనిపించింది. టెక్నికల్ టీం విషయానికి వొస్తే ఈ సినిమాని కలర్ఫుల్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దానికి సినిమాటోగ్రాఫర్ కష్టం అన్ని ఫ్రేమ్స్ లో కనిపిస్తోంది. ఇక మ్యూజిక్ విషయానికి వొస్తే అది కూడా ప్రేక్షులను ఆకట్టుకునేలా ఉంది. ఓటీటీ సినిమానే అయినా బాగానే ఖర్చు పెట్టినట్టు అనిపించింది.
ఫైనల్లీ ఈ వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఎమోషనల్ ఎంటర్ టైనర్. కామెడీ మాత్రమే ఎక్స్ పెక్ట్ చేస్తే నిరాశ తప్పదు.