కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రలలో రూపొందిన *ఉప్పు కప్పురంబు* అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒరిజినల్ సినిమాగా రూపొందింది. నిజానికి ఈ సినిమా దర్శకుడికి పెద్దగా అనుభవం లేదు, కానీ కీర్తి సురేష్, సుహాస్ లాంటి వాళ్లను ఒప్పించడమే మొదటి విజయంగా అందరూ భావించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా జూలై 4, అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్, టీజర్ కట్స్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఉప్పుకప్పురంబు కథ:
రానా వాయిస్ ఓవర్‌తో ఈ కథ మొదలవుతుంది. 1990లలో చిట్టి జయపురం అనే గ్రామంలో పెద్ద శుభలేఖ సుధాకర్ మరణించడంతో అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేష్) కొత్త గ్రామ పెద్దగా నియమితురాలవుతుంది. ఆమె గ్రామ పెద్దగా నియమించబడటం ఇష్టం లేని భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే, అనుకోకుండా ఆ ఊరికి ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది. నిజానికి సంప్రదాయం ప్రకారం ఆ ఊరిలో ఎవరు చనిపోయినా ఊరికి ఉత్తరాన పాతిపెట్టడం ఆనవాయితీ. అలా పాతిపెట్టే స్మశానం నిండిపోవడంతో, కొత్తగా ఎవరైనా చనిపోతే ఎక్కడ పాతిపెట్టాలనే సమస్య మొదలవుతుంది. ఇంకా నలుగురికి మాత్రమే చోటు ఉండటంతో, ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసే ప్రయత్నం చేయడంతో అనుకోకుండా మరో నలుగురు మృతి చెందుతారు. చివరికి ఆ నలుగురిని పాతిపెట్టాక, ఆ ఊరి స్మశాన కాపరి చిన్న (సుహాస్) ఒక మోసం చేశాడని బయటపడుతుంది. ఇంతకీ చిన్న చేసిన మోసం ఏమిటి? చిన్న కుటుంబాన్ని వెలివేసిన తర్వాత ఆ ఊరికి ఏం జరిగింది? చివరికి ఈ సమస్యను పరిష్కరించారా? ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరికింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి ఈ సినిమా కోసం రాసుకున్న లైన్ చాలా బాగుంది. 90లలో ఒక గ్రామం, అమాయకమైన జనం, వారి సంప్రదాయాల ప్రకారం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే మనస్తత్వాలు—అలాంటి ఒక గ్రామంలో స్మశానానికి స్థలం అవసరమైతే ఆ ఊరి ప్రజలందరూ ఏం చేశారు, ఊరి పెద్ద ఆ ఊరి స్మశాన కాపరితో కలిసి ఎలాంటి పరిష్కారం కనుగొన్నారు అనేది చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. కానీ, రాసుకున్న దాన్ని అంతే ఆసక్తికరంగా తెరమీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో తడబడ్డారు. సినిమా మొదలైన మొదటి సీన్ నుంచే స్లాప్‌స్టిక్ కామెడీతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. సినిమా కథ ప్రకారం అలా రాసుకున్నాడో లేక కావాలనే ప్రతి క్యారెక్టర్‌ను రాసుకున్నాడో తెలియదు, కానీ కీర్తి సురేష్, సుహాస్ సహా తెర మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ చాలా లౌడ్‌గా, ఎక్స్ట్రీమ్ లెవెల్‌లో నటిస్తూ కనిపిస్తారు. నిజానికి ఒక్కొక్కరి క్యారెక్టర్‌ను రాసుకున్న విధానం బాగుంది, కానీ వారు ఇచ్చే లౌడ్ పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల క్రింజ్ అనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా ఊరంతా గొడవలు పడటం, ఏమీ తెలియని అమాయకపు ముఖాలు పెట్టడం వంటివి కన్వెన్షనల్‌గానే ఉన్నా, కీర్తి సురేష్ ఊరి పెద్దగా మారిన తర్వాత జరిగే కొన్ని సన్నివేశాలు లాజికల్‌గా అనిపించవు. ముఖ్యంగా, కీర్తి సురేష్ క్యారెక్టర్ కన్ఫ్యూజింగ్‌గా రాసుకుంటూనే కొన్ని చోట్ల అందరికన్నా చాలా తెలివిగా వ్యవహరించినట్లు చూపించారు. ఇది కొంచెం కన్విన్సింగ్ అనిపించదు. అలాగే, ఆమె క్యారెక్టర్‌ను ఓవర్ రియాక్ట్ అయ్యేలా కాకుండా కాస్త స్టేబుల్‌గా రాసుకుని ఉంటే ఇంకా కనెక్ట్ అయి ఉండేదేమో. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే సుహాస్, అతని తల్లి ట్రాక్ ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా ఉంది. మిగతా సీన్స్‌తో పోలిస్తే చాలా న్యాచురల్‌గా, ఇంకాసేపు ఉంటే బావుండు అనిపించేలా ఈ ట్రాక్ ఉంది. నిజానికి ఈ సినిమాను ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే, కొంతవరకు ఆ వరల్డ్‌లోకి వెళ్లడానికి టైం పట్టిన తర్వాత బాగుందనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, కీర్తి సురేష్ క్యారెక్టర్ రాసుకున్న విధానమే చాలా లౌడ్‌గా ఉంది కాబట్టి ఆమెను ఏమీ అనలేము. అయితే, తన రొటీన్ క్యారెక్టర్ల నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చేసిన క్యారెక్టర్‌గా ఇది నిలిచిపోతుంది. క్యూట్‌గా కనిపిస్తూనే తనదైన తింగరితనంతో కీర్తి సురేష్ నటన బావుందనిపిస్తుంది. అయితే, కొన్ని చోట్ల లౌడ్ యాక్టింగ్ కారణంగా క్రింజ్ ఫీలింగ్ కలిగితే, అది మీ తప్పు కాదు. మంచి క్యారెక్టర్ పడింది. ఒక కాటి కాపరి పాత్రలో సుహాస్ మెరిచాడు. తాళ్లూరి రామేశ్వరికి చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. బాబు మోహన్ కూడా తనదైన శైలిలో నటించారు. ఇక శత్రు సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమాను చాలా రిచ్‌గా, న్యాచురల్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా ఫ్రేమ్స్‌లో కనిపించింది. ఇక సినిమాలోని డైలాగ్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించింది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా: *ఉప్పు కప్పురంబు* ఒక లౌడ్ కామెడీ ఫిల్మ్ విత్ ఎ మెసేజ్.