భాష ఏదైనా థ్రిల్లర్ సినిమా అంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఈ క్రమంలోనే అధర్వ మురళి హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా రవీంద్ర మాధవ డైరెక్షన్లో టన్నెల్ అనే సినిమా రూపొందింది. తమిళంలో తనల్ పేరుతో రిలీజ్ అయిన సినిమాని తెలుగులో టన్నెల్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి రివ్యూలో చూద్దాం.
కథ
ఏమాత్రం బాధ్యతలు లేకుండా
ఉండే యువకుడు (అథర్వా మురళీ) అను (లావణ్య త్రిపాఠి) ప్రేమలో పడతాడు. యూపీఎస్సీ పాస్ అయిన అనుతో పెళ్లి కావడం కోసం అధర్వ ప్రయత్నం చేసి కానిస్టేబుల్ గా రిక్రూట్ అవుతాడు. జాయినింగ్ రోజే వారికి ఓ పెద్ద టాస్క్ పడుతుంది. ఆ టాస్క్ నుంచి హీరో అండ్ గ్యాంగ్ ఎలా బయటపడతారు? అసలు విలన్ వేసిన వలలో అధర్వా అలాగే అతను స్నేహితులు ఎలా చిక్కుకున్నారు? పోలీస్ యూనిఫాం అంటే విలన్‌కు ఎందుకు అంత వ్యతిరేకత? చివరకు టన్నెల్ ద్వారా విలన్ అండ్ గ్యాంగ్ ఏం చేసింది? అన్నదే కథ.
విశ్లేషణ
‘టన్నెల్’ సినిమా ఓపెనింగ్ లోనే సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. బ్యాంక్ దొంగ తనం చేసిన గ్యాంగ్, ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. ఆ పోలీసుల్ని హతమార్చే గ్యాంగ్.. ఆ తరువాత కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగంలోకి జాయిన్ అయిన ఆరుగురు కుర్రాళ్లు.. ఇలా కథ ఆసక్తికరంగా సాగుతూ ఉండగా మరోపక్క హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నడుస్తుంది. ఆ తరువాత ఇంటర్వెల్‌కు అదిరిపోయేలా ట్విస్ట్ ఒకటి రాసుకున్నారు. స్లమ్ ఏరియా సెటప్ అంతా కొత్తగా లేకపోయినా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అయితే కథలో వేగం కాస్త తప్పినట్టుగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత ఎఫెక్టివ్ అనిపించదు. పైగా ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఏదో ఇరికించిన ఫీలింగ్ తెప్పిస్తాయి. అక్కడే ఎమోషనల్ పార్ట్ వీక్ అయిన ఫీల్ కలిగింది.
నటీనటులు
‘టన్నెల్’ మూవీలో అథర్వా మురళీ యాక్టింగ్ బాగుంది. ఎప్పటిలానే యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ సీన్లలో అథర్వా మెప్పించాడు. ఇక అశ్వత్ కాకుమాను విలనిజాన్ని తారాస్థాయిలో పండించేశాడు. అదే సమయంలో మరో కోణాన్ని కూడా చూపించాడు. ఇక లావణ్య త్రిపాఠిది రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రే. హీరో గ్యాంగ్, ఇతర పోలీస్ ఆఫీసర్ల పాత్రలో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. టెక్నికాలిటీస్ పరంగా చూసుకుంటే చూసుకుంటే మాత్రం ఈ మూవీ ఎక్కువ శాతం నైట్ టైంలోనే షూటింగ్ చేయగా విజువల్స్ బాగున్నాయి. సీన్లకు తగ్గట్టుగా ఆర్ఆర్ బాగా కుదిరినట్లే. ఇక ఎడిటింగ్, స్లమ్ ఏరియా సెట్ వర్క్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగానే ఉంటాయి.
యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్‌కి ఈ ‘టన్నెల్’ నచ్చచ్చు.