NTV Telugu Site icon

Thiragabadara Saami Review: తిరగబడరా సామి రివ్యూ

Tiragabadara Saami Review

Tiragabadara Saami Review

Thiragabadara Saami Movie Review: హ్యాట్రిక్ హిట్లు కొట్టి సినీ పరిశ్రమలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిన రాజ్ తరుణ్ ఆ తరువాతి కాలంలో సరైన ఎంపిక లేక దారుణ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యనే పురుషోత్తముడు అనే సినిమా చేసి కొంత పర్వాలేదు అనే టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం దారుణ ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తిరగబడరా సామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మాల్దీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ప్రేమాయణం నడుపుతున్నాడని అతని మాజీ ప్రియురాలు పోలీసుల ముందుకు వచ్చి పెద్ద రచ్చ చేయడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది ట్రైలర్ పెద్దగా మెప్పించకపోయినా సినిమా ఏదైనా మెప్పిస్తుందేమో అని అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులు ఎలా బయటకు వచ్చారు సినిమా ఎలా అనిపించింది. అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ
గిరి (రాజ్ తరుణ్) ఒక అనాధ. చిన్నతనంలో తప్పి పోయి ఓ అనాథలా మారిన గిరి తప్పిపోయిన వారిని కని పెట్టి వారి వారి కుటుంబానికి దగ్గర చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఎవరూ లేక అనాథలా ఉన్న గిరిని చిన్నతనంలో ఆటో జానీ (బిత్తిరి సత్తి) చేరదీస్తాడు. అదే కాలనీలో ఉండే మటన్ మస్తాన్(రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) సహా అందరూ గిరిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయితే స్వతహాగా పిరికివాడైన గిరి గొడవలకు దూరంగా బతుకుతూ తనకంటూ ఓ మంచి కుటుంబం రాకపోతుందా? అని ఆ కుటుంబం కోసం కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే గిరి జీవితంలోకి శైలజ (మాల్వీ మల్హోత్ర) ఎంట్రీ ఇస్తుంది. అలా శైలజ వచ్చాక గిరి జీవితంలో వచ్చిన మార్పులేంటి? శైలజ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? శైలజ కారణంగా గిరికి వచ్చిన సమస్యలు ఏంటి? క్రూరుడైన జహీరాబాద్ కొండారెడ్డి (మకరంద్ దేశ్ పాండే) వల్ల గిరికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? లాంటివి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
తిరగబడర సామీ సినిమా చుట్టూ మొదటి నుంచి వివాదాలే చుట్టుముడుతూ వచ్చాయి. ముందుగా డైరెక్టర్ మన్నారా చోప్రాకి ముద్దు ఇవ్వడం. హీరో హీరోయిన్ల మీద హీరో మాజీ ప్రియురాలు యుద్దానికి దిగడం లాంటివి సినిమాకి మంచి ప్రమోషన్ చేసి పెట్టాయి. ఇక సినిమా విషయానికి వస్తే మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్షలా నడుస్తూ వెళ్ళింది. ఈ సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు. ఓ పాతిక ముప్పై ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా అనిపించక మానదు. మామూలుగా పాత సీసాలో కొత్త సారా అన్న చందంగానో, లేదా కొత్త సీసాలో పాత సారా అన్నట్టో కూడా ఈ సినిమా అనిపించదు. సీసా, సారా రెండూ కూడా పాతవే అనేలా నడిపించాడు డైరెక్టర్. ఇప్పుడున్న కాలంలో కొత్త కథలు సృష్టించడం కష్టమే. అలా అనుకున్నప్పుడు పాత కధనే ఆసక్తికరంగా చెప్పాలి కానీ కథనం విషయంలో కూడా ఏమాత్రం కేర్ తీసుకోలేదు. మేకింగ్ చూస్తే అసలు ఇది 2024 సినిమానా అనే అనుమానం కలిగితే అది మీ తప్పు కాదు. బిగ్ స్క్రీన్ మీద సీరియల్ చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది. మాములుగా సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎమోషన్, ఎక్కడో ఏదో ఒక సీన్ అయినా కనెక్ట్ అయ్యేలా రాసుకుంటారు కానీ ఈ సినిమాలో ఒక్క చోట కూడా ఆడియెన్స్ కనెక్ట్ కాలేరు. కొన్ని సీన్లు సిల్లీగా అనిపిస్తే కొన్ని సీన్స్ ఓవర్ యాక్షన్‌లా అనిపిస్తాయి. ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా సాగదు. నెక్ట్స్ సీన్ ఏంటన్నది చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడనేలా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మాల్వీ మల్హోత్రా కంటే.. విలన్ గ్యాంగ్‌లో కనిపించిన మన్నారా చోప్రా గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది. అయితే ఆమె నటన కూడా సెట్ కాలేదు. ప్రగతి, రాజా రవీంద్ర, ఆటో జానీ, గీతా సింగ్ ఇలా అన్ని పాత్రల డిజైనింగ్ లోనే లోపం ఉండడంతో అవి పండలేదు. ఇక మకరంద్ దేశ్ పాండే పాత్ర కూడా అప్ టు మార్క్ అనిపించలేదు. హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మధ్య కెమిస్ట్రీ, తెరపై రొమాన్స్ బాగానే కుదిరినట్టుగా కనిపిస్తుంది. టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే సంగీతం సెట్ కాలేదు. పాటలు గుర్తుంచుకునేలా లేవు సరికదా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దారుణంగా ఉంది. డైలాగ్స్ రొటీన్‌గా ఉన్నాయి. కాస్తో కూస్తో మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే సినిమా నిడివి తక్కువ ఉండడమే.

ఫైనల్లీ : తిరగబడర సామీ -వివాదాలు ఫుల్ – మ్యాటర్ నిల్