NTV Telugu Site icon

Takkar Movie Review: టక్కర్

Takkar

Takkar

Takkar Movie Review: సిద్ధార్థ్ పేరు వినగానే ‘బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇటు తెలుగు అటు తమిళంలో ఫామ్  కోల్పోయిన సిద్ధార్థ్ పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్నాడు. ‘మహాసముద్రం’తో రీఎంట్రీ ఇచ్చినా  సక్సెస్ అందుకోలేక పోయాడు. తాజాగా తను నటించిన తమిళ సినిమా ‘టక్కర్’ తెలుగులో అనువాదమై ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

కథ విషయానికి వస్తే గుణశేఖర్ (సిద్దార్థ్) పేదింటి కుర్రాడు. దాంతో డబ్బు సంపాదన కోసం పుట్టిన ఊరు నుంచి వైజాగ్ వస్తాడు. డబ్బు సంపాదనలో భాగంగా రకరకాల జాబ్స్ చేసినా తన కోపం వల్ల ఏ ఉద్యోగంలోనూ కుదురుకోలేక పోతాడు. అలా కాదని బెంజ్ కారును ట్యాక్సీగా నడుపుతుంటాడు. అయితే ఓ ప్రమాదం వల్ల కారు డ్యామేజ్ అయి యజమాని చేతిలో దెబ్బలు, తిట్లు తిని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ధైర్యం సరిపోక రౌడీ మూకల వద్దకు వెళితే వారే చంపేస్తారని భావిస్తాడు. అయితే అసంకల్పిత ప్రతీకారచర్య తో ఆ రౌడీలను కొట్టి వారి కారు తీసుకుని పారిపోతాడు. ఆ కారు డిక్కీలో రౌడీలు కిడ్నాప్ చేసిన ఓ అమ్మాయి ఉంటుంది. అంతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. అసలా అమ్మాయి ఎవరు? తనని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆపై గుణశేఖర్ జీవితం ఎలాంటి మలుపులు తిరగిందన్నదే మిగతా కథ.

సిద్దార్థ్ నటించిన ఈ రోమ్ క్యామ్ మూవీ ‘టక్కర్’ ఏ సన్నివేశంలోనూ ఆకట్టుకునేలా సాగక పోవడం విశేషం. అసలు సిద్దూ గెటప్ తోనే ఆడియన్స్ ఇన్ వాల్వ్ మెంట్ను దూరం చేశాడు దర్శకుడు కార్తీక్ క్రిష్‌. ఏదో సాధించి ఎత్తుకు ఎదగాలనుకున్న హీరోను ఆత్మహత్య చేసుకోవాలనుకునే పిరికి వాడిగా చూపించటంలోనే దర్శకుడు తనేం చెప్పదలచుకున్నాడో అది పూర్తిగా మిస్ అయ్యాడు. చావటానికి ధైర్యం లేని హీరో రౌడీల వద్దకు వెళ్ళి చావాలనుకోవడం, వెంటనే వారి మీద తిరగబడి చితకబాదేయడం దర్శకుడు బుర్రనుంచి వచ్చిన బహు విచిత్రాలు. కిడ్నాప్ అయిన హీరోయిన్ తో హీరో ప్రేమ. ఆ తర్వాత పెళ్ళికాకుండానే వారి శోభనం మొదలైనవి ఆయన దరిద్రపు టేకింగ్ కి పరాకాష్ట.

ఇమేజ్ కు భిన్నమైన పాత్ర చేసిన సిద్ధార్థ్ సైతం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయాడు. ఇందులో తన లుక్ గురించి ఎంత తక్కువ చెప్పకుంటే అంత మంచిది. హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ చూడటానికి బాగున్నా ఆ పాత్రలో ఎలాంటి వైవిధ్యం లేకోవడంతో అంతగా ఆకట్టుకోదు. విలన్ పాత్రలో అభిమన్యు సింగ్, కామెడీ పాత్రలో యోగిబాబు ఎలాంటి ప్రభావం చూపించలేక పోయారనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని పాటల్లో ఏ ఒక్కటి మళ్ళీ హమ్ చేసుకునేలా లేదు. నిర్మాణ విలువలు సోసో. ఈ తరహా సినిమాను పీపుల్స్ మీడియా వారు ఎందుకు రిలీజ్ చేశారో వారికే తెలియాలి. వరుస సినిమాలతో జోరుమీదున్న ఈ సంస్థ ఇలాంటి సినిమాలను ఎటెమ్ట్ చేస్తూ పోతే వారి రిపుటేషన్ దెబ్బతినటం ఖాయం. సో బికేర్ ఫుల్.

ప్లస్ పాయింట్స్
సిద్ధార్థ్ సినిమా కావటం
పీపుల్స్ మీడియా రిలీజ్ చేయటం

మైనస్ పాయింట్స్
కథ, కథనం, దర్శకత్వం
సిద్ధార్గ్ లుక్
పాటలు

రేటింగ్ – 2/5

ట్యాగ్ లైన్: చూస్తేనే చక్కర్

Show comments