Suvarna Sundari Movie Review: సీనియర్ నటీమణి జయప్రద చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్నారు. ఐదేళ్ళ క్రితం ‘శరభ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత ‘సువర్ణ సుందరి’ సినిమాలో ప్రధాన భూమిక పోషించారు. రెండేళ్ళ క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. పూర్ణ, సాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న జనం ముందుకు వచ్చింది. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో ఎమ్. ఎల్. లక్ష్మీ ఈ సినిమాను నిర్మించారు.
300 ఏళ్ళ క్రితం కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో ఈ కథ మొదలవుతుంది. రాజాజ్ఞ మేరకు త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసిన ఓ వ్యక్తి దానిలో దుష్టశక్తులను నింపుతాడు. విగ్రహ ప్రతిష్ఠకు ముందే కీడు గ్రహించిన రాజు అతన్ని హతమార్చినా, అందులోని దుష్టశక్తి యువరాణి శరీరంలోకి ప్రవేశించి, ఆ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. అయితే, ఆ దుర్మార్గుడి కొడుకు పెరిగి పెద్దైన తర్వాత విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. అతన్ని చంపేసిన గ్రామీణులు ‘సువర్ణ సుందరి’ విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. ఇది జరిగిన మూడువందల సంవత్సరాల తర్వాత ఓ వ్యక్తి ఆ విగ్రహాన్ని పొరపాటున బైటకు తీయడంతో అతని కుటుంబమూ నాశమౌతుంది. స్వాతంత్రానంతరం ఈ సువర్ణ సుందరి విగ్రహం ఓ పాత బంగ్లాలోకి చేరుతుంది. అందులో దిగిన కలెక్టర్ భార్య అంజలి (పూర్ణ) కుటుంబమూ ఈ విగ్రహం కారణంగా బలైపోతుంది. అయితే ఆ విగ్రహంలో దుష్టశక్తి దాగుందనే విషయం తెలియని కొందరు కోట్లు ఖర్చుపెట్టి సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. ఆ విగ్రహం కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనియర్ ఆర్కియాలజిస్ట్ (జయప్రద) ఆ వినాశనాన్ని ఎలా అరికట్టిందన్నదే చిత్ర కథ.
దర్శకుడు సురేంద్ర ఓ కాంప్లికేటెడ్ స్టోరీ తీసుకుని, ఆసక్తి కరంగా అందించే ప్రయత్నం చేశారు. దీన్ని ముందుకూ, వెనక్కి నడిపి ఉత్సుకత కలిగించాలని అనుకున్నారు. అయితే అందులో కొంతమేరకే సక్సెస్ అయ్యారు. సహజంగా పురాతన విగ్రహాలలో తెలియని శక్తి దాగి ఉంటుందని కొందరు నమ్ముతారు. అయితే అందులో దుష్టశక్తి ఉంటే ఎలాంటి వినాశనం జరుగుతుందో ఈ చిత్రంలో చూపించారు. అయితే ఇలాంటి దుష్టశక్తులను ఏదైనా రాజ్య సంస్థానాల్లోనో, పురాతన మందిరాల్లోనో బంధించిన చిత్రాలను ఇప్పటి వరకూ చూశాం. కానీ ఇందులో సువర్ణ సుందరి విగ్రహంలో ఆ దుష్టశక్తి దాగి ఉండటం అనేది కొత్త అంశం. బట్… అది ఎవరి దగ్గర ఉంటే వారికి నెగెటివ్ థాట్స్ కలిగి, తమ సొంతవాళ్ళనే అకారణంగా అంతచేయాలనే ఆలోచన కలుగుతుందని చూపడం కాస్తంత చిత్రమే! ఇలాంటి చిత్ర విచిత్రాల సంఘటనలు ఈ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తెర మీద జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు వంటి నటీనటులు కనిపించే సరికీ కథలోని లోటుపాట్ల గురించి ప్రేక్షకులకు పెద్దంత దృష్టి పోదు. ప్రథమార్ధం ‘సువర్ణ సుందరి’ విగ్రహం మీద సాగినా… ద్వితీయార్థంలో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లోని లిఫ్ట్ లో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రాణాలు కోల్పోవడం అనేది క్యూరియాసిటీని కలిగిస్తుంది. అయితే… ఈ సన్నివేశాలను కలపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సాయికుమార్ లాంటి సీనియర్ నటుడిని పోలీస్ ఆఫీసర్ గా రంగ ప్రవేశం చేయించి, అతని ద్వారా ఎలాంటి పరిష్కారం చూపకపోవడం వెలితిగా అనిపిస్తుంది. అలానే హిందూ మైథాలజీకి సంబంధించిన ఈ కథలోకి కళ్ళు లేని కబోది అయిన క్రిస్టియన్ ఫాదర్ ను తీసుకురావడం, అతని ద్వారా ఆర్కియాలజిస్ట్ కు బోధ చేయించడం సబబుగా అనిపించవు. ఇటు పూర్ణకు, అటు సాక్షి చౌదరికి పెయిర్ గా నటించిన ఇంద్ర, రామ్ పాత్రలను మరింత బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. ఇతర ప్రధాన పాత్రలను సత్యప్రకాశ్, సత్యదేవ్, వీరభ్రదం, అవినాశ్, నాగినీడు తదితరులు పోషించారు.
పకడ్బందీగా కథను రాసుకోవడం మీద కంటే దర్శకుడు గ్రాఫిక్స్ మీదనే ఎక్కువ ఆధారపడ్డాడు. సినిమా మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ లో తీసిన విషయాన్ని వాళ్ళే రోలింగ్ టైటిల్స్ లో చూపించారు. ఓ రకంగా ప్రేక్షకులకు కనికట్టు చేసే ప్రయత్నం చేశారు. పూర్ణ మీద చిత్రీకరించి సెట్ సాంగ్ బాగుంది. అలానే బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూవీని కాస్తంత నిలబెట్టాయి. సోషియో థ్రిల్లర్, హారర్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘సువర్ణ సుందరి’ ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.
ప్లస్ పాయింట్స్
జయప్రద నటించడం
సోషియో థ్రిల్లర్ కావడం
సాంకేతిక నిపుణుల పనితనం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
సరిగా లేని క్యారెక్టరైజేషన్
పేలవమైన గ్రాఫిక్స్
ట్యాగ్ లైన్: సో.. సో… సుందరి!