NTV Telugu Site icon

Kanguva Review: సూర్య ‘కంగువా’ రివ్యూ!

Kanguva1

Kanguva1

సూర్య హీరోగా దిశ పటానీ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం కంగువా. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన శివ తమిళంలో ఇప్పుడు మంచి ఫేమస్ డైరెక్టర్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో ఈ కంగువా సినిమా తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజాతో పాటు యువి సంయుక్తంగా ఈ కంగువా సినిమాని నిర్మించారు. టీజర్, ట్రైలర్ కట్స్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సూర్య చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో అసలు సినిమా ఎలా ఉంటుందా? అని అందరిలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం

కథ:
2024, ఒక రష్యన్ గ్యాంగ్ నడిపే టెస్టింగ్ లాబ్ నుంచి జీటా అనే బాలుడు తప్పించుకోవడంతో కథ మొదలవుతుంది. ఎక్కడో బోర్డర్ నుంచి ఆ బాలుడు గోవాలో ఉన్న ఫ్రాన్సిస్ (సూర్య)ను వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని ట్రేస్ చేసి తీసుకు పోతారు రష్యన్ గ్యాంగ్. వెంటనే కథ 1070 లోకి వెళ్తుంది. అక్కడ సముద్రంలో ఉండే పంచ ద్వీప సమూహంలో ఉన్న ప్రణవాది కోన నాయకుడు కొడుకు కంగువా(సూర్య). విదేశీయులు ఇండియాను స్వాధీనం చేసుకోవడానికి బేస్ క్యాంప్ సెట్ చేసుకోవడం కోసం వాళ్ళకి ప్రణవాది కోన అవసరం అవుతుంది. సాగర కోన నాయకుడు ప్రణవాది కోనను విదేశీయులకు అప్పగించేందుకు సిద్ధమై కంగువా చేతిలో మరణిస్తాడు. ఆ తరువాత కపాల కోన నాయకుడు( బాబీ డియోల్) కూడా ప్రణవాది కోనను విదేశీయులకు అప్పగించేందుకు సిద్ధమై యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? శత్రు తెగ నాయకుడికి కొడుకు పులోమాను కంగువా ఎందుకు కాపాడడానికి సిద్ధమయ్యాడు? అసలు ఫ్రాన్సిస్ కు కంగువాకి సంబంధం ఏంటి? ఫ్రాన్సిస్ ను వెతుక్కుంటూ జీటా ఎందుకు వచ్చాడు? జీటా మీద ప్రయోగాలు చేసేది ఎవరు? చివరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి తెలుగులో బాహుబలి లాంటి సినిమా వచ్చిన తర్వాత అదే రీతిలో కొంచెం భారీగా, ప్రేక్షకులకు భిన్నంగా ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు అనేకమంది దర్శక నిర్మాతలు అనేక భాషలలో ప్రయత్నాలు చేశారు. ఒక రకంగా ఈ సినిమా మొదలైన తర్వాత ఈ సినిమా కూడా అలాంటి ఒక ప్రయోగమే అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా ప్లాట్ పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా అనిపించింది. కానీ అది పేపర్ వరకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది ఎందుకంటే దానిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసుకురావడంలో శివ అండ్ టీం తరబడింది. సినిమా కథ కొత్తది కాదు అలాంటప్పుడు తెరకెక్కించే విషయంలో అయినా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకునే ఉంటే బాగుండేది. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఊహకు ఈజీగా అందేస్తుంది. అలాగే తమిళ లోకల్ ఫ్లేవర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. దానికి తోడు సినిమాలో కనిపించిన నటీనటులు కారణం లేకుండా అరుస్తూ ఉండడం కాస్త ఇబ్బందికర అంశం. దాదాపు అందరు నటీనటుల నటనతో పాటు, ప్రతి నటులను చూపిన విచిత్రమైన రూపాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమా కథ 1070 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. తర్వాత 2024లో ల్యాబ్‌లో జీటా అనే పిల్లవాడి మీద చేసే ప్రయోగాలు గురించి చర్చిస్తూ ఫస్ట్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచారు. అయితే ఈ రెండు సీక్వెన్స్‌ల తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ఊహకు తగ్గట్టుగానే ఉంటాయి. ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత మెరుగ్గా అనిపిస్తుంది, ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్ లె లు అయితే బాగా పేలాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన గోవా బ్యాక్‌డ్రాప్‌లో సూర్య, దిశా పటానీ, యోగి బాబు సీక్వెన్స్‌ లు ఎందుకో పెద్దగా పేల లేదు. సినిమాలో కొన్ని బ్లాక్‌లు అబ్బురపరిచినా చాలావరకు సినిమా సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ కలగకుండా చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. కంగువా సినిమాతో ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని చెప్పే అవకాశం ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో తడబాటు కారణంగా అందరికీ కనెక్ట్ అవడం కష్టమే. అయితే సినిమా చివరి అరగంట ప్రేక్షకులను అబ్బుర పరిచారు. ఇక సినిమా క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్ కోసం ఒక స్టార్ హీరో సర్ప్రైజ్ క్యామియోని ఉపయోగించి ఇచ్చిన లీడ్ కూడా ఆసక్తికరం.

నటీనటుల విషయానికి వస్తే:
ఫ్రాన్సిస్ పాత్రలో సూర్య కాస్త రియాలిటీకి భిన్నంగా కనిపించినా కంగ అలియాస్ కంగువా పాత్రలో మాత్రం పరకాయ ప్రవేశం చేశాడు. కంగువా పాత్రలో నటన విషయంలో చాలా సీన్స్ కళ్లతోనే నటించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఏంజెలాగా దిశా పటానీ పాత్ర చాలా పరిమితం. ఇక బాబీ డియోల్ చాలా విచిత్రమైన లుక్‌తో భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక పులోమా & జీటా పాత్రలు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆకట్టుకున్నాడు. ఇక యోగి బాబు, కోవై సరళ మరియు మరికొంత మంది ప్రముఖ నటీనటుల పాత్రలు కూడా చాలా పరిమితం. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ అంశాల విషయానికి వచ్చేసరికి వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధానమైన అసెట్. దేవి శ్రీ ప్రసాద్ పాటలు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ కానీ ఆకట్టుకునేలా లేవు .యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి . నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాలో చాలా వరకు వీఎఫ్ ఎక్స్ ఆకట్టుకునేలా లేవు. స్టూడియో గ్రీన్ – UV క్రియేషన్స్ నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.

ఫైనల్లీ:
కంగువా ఒక లార్జర్ ధాన్ లైఫ్ థాట్.. యాక్షన్ లవర్స్ కి నచ్చొచ్చు కానీ కండిషన్స్ అప్లై.