హీరో సందీప్ కిషన్ చాలా కాలం నుండి సరైన హిట్టు కొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. అయితే గతంలో టైగర్ అనే సినిమా చేసిన వీఐ ఆనంద్ తో ఊరు పేరు భైరవకోన అనే సినిమా చేశాడు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని హాస్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాజేష్ దండా నిర్మించగా అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. నిజానికి ఈ సినిమా కంటెంట్ మీద చాలాకాలం నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. దానికి తోడు గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలే ఈ భైరవకోన అని చెబుతూ ఉండడంతో సినిమా మీద ఉన్న ఆసక్తి అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఇక సోలో రిలీజ్ కోసం ఫిబ్రవరి 9 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
ఊరు పేరు భైరవకోన కథ:
బసవలింగం (సందీప్ కిషన్) తన పార్ట్నర్ జాన్(వైవా హర్ష) తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. పైకి సినిమాలకు స్టంట్స్ చేసే స్టంట్ బాయ్ అని చెప్పుకుంటున్నా మరొక పక్క మాత్రం తన బాబాయ్ (మాణిక్ రెడ్డి) చెప్పిన ఇల్లీగల్ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి అతను ఒక పెళ్లి జరుగుతున్న ఇంట్లో పెళ్లి కూతురు నగలు దొంగతనం చేస్తాడు. ఆ నగలతో ఉడాయిస్తున్న సమయంలో అతనికి మరొక లేడీ దొంగ గీత(కావ్య) రోడ్డు ప్రమాదానికి గురై కనిపిస్తుంది. ఆమె గురించి తెలియక ఆమెను కాపాడాలని కార్ ఎక్కించుకునీ అనూహ్యంగా భైరవకోన అనే ఊరిలోకి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ ఊరిలో వీరికి అనేక షాకింగ్ సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఊరికి వెళ్లడమే కానీ బయటికి వెళ్లే అవకాశం లేదని ఆ ముగ్గురికి తెలుస్తుంది. అసలు భైరవకోనకు బసవ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? బసవను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? బసవని అక్కడికి రప్పించింది ఎవరు? తాను ప్రేమించిన భూమి(వర్ష) ఎందుకు బసవకి దూరమైంది? చివరికి భూమి, బసవ కలిశారా? భైరవకోన నుంచి ఆ ముగ్గురు బయట పడ్డారా? అసలు గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలకి భైరవకోనకి సంబంధం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా థియేటర్లో చూసేయాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగా వీఐ ఆనంద్ సినిమాలు కాస్త విలక్షణమైన లైన్ లోనే సాగుతూ ఉంటాయి. ఎక్కువగా ఆయన మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం గురించి ఆసక్తి ఉండడంతో ఈ సినిమా చేశానని ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున చెప్పుకొచ్చారు. గతంలో ఆయన చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా కొంత ఈ లైన్ లోనే సాగుతూ ఉండడంతో పాటు గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలే ఈ భైరవకోన అని ప్రమోషన్ చేయడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరిలో ఆసక్తి ఏర్పడింది.. ఆ ఆసక్తితోనే సినిమా మొత్తం నడిపించాడు దర్శకుడు. సినిమా మొదట్లోనే హీరో క్యారెక్టర్ ఒక దొంగ అని ఎస్టాబ్లిష్ చేస్తూనే ఆ దొంగతనం వల్లే భైరవకోనకి వెళ్లాల్సి రావడం, ఆ నగలు ఎందుకు దొంగతనం చేశాడు?ఆ దొంగిలించిన నగలతో ఏం చేయాలనుకున్నాడు లాంటి విషయాలను అసలైన కథతో ఆసక్తికరంగా ముడిపెట్టారు. అనూహ్య పరిస్థితుల్లో హీరోతో పాటు కావ్య, వైవాహర్ష భైరవకోనలోకి ఎంటర్ అవ్వడంతోనే సినిమా మొత్తం మీద ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. దానికి తోడు వైవా హర్ష, సందీప్ కిషన్, వైవా హర్ష- వెన్నెల కిషోర్ మధ్య రాసుకున్న కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ వన్ లైనర్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. అయితే గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలే ఈ భైరవకోన అని ముందు నుంచి చెబుతూ వచ్చిన దర్శకుడు ఎందుకో దాన్ని పూర్తిస్థాయిలో కన్విన్సింగ్ అనిపించేలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంలో తడబడినట్లు అనిపించింది. కొన్ని విషయాలు ప్రేక్షకులకు లాజికల్ గా కనెక్ట్ అవ్వవు. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా తర్వాత ఏం జరుగుతుందో ఏ మాత్రం ఊహించకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలమయ్యాడు. గతంలో మనం ఎన్నో రకాల హారర్ కామెడీ సినిమాలు చూసాం చూస్తూనే ఉంటాం, కానీ ఈ సినిమా కొంత భిన్నంగా అనిపించింది. గరుడ పురాణం అనే సబ్జెక్టు మీద ఉన్న ఆసక్తితో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు కేవలం భైరవకోనకు గరుడ పురాణానికి ఉన్న లింకు కట్టే కొట్టే తెచ్చే లాగా చెప్పేయడం కాస్త నిరాశపరిచే అంశం. అయితే చిన్నచిన్న లోపాలు, కన్విన్సింగ్ అనిపించని విషయాలు పక్కనపెడితే ఓవరాల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆద్యంతం నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే:
ఒక దొంగగా, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రేమికుడిగా సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు. లుక్స్ విషయంలో కేర్ తీసుకోలేదేమో అనిపించింది కానీ ఫైట్స్ విషయంలో మాత్రం హోంవర్క్ గట్టిగానే చేసాడనిపించింది. వర్షా బొల్లమ్మ స్క్రీన్ మీద అందంగా కనిపించింది, పద్ధతి అయిన ఒక ట్రైబల్ అమ్మాయిగా తన పాత్రలో ఇమిడిపోయింది. సందీప్ కిషన్ – వర్ష మథ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. కావ్యకి ఇది సెకండ్ హీరోయిన్ రోల్ లాగానే ఉంది.. అయితే ఆమెకు కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ట్రాక్ అత్యద్భుతంగా కుదిరింది. బొమ్మాలి రవిశంకర్, వడివక్కరసి, జయప్రకాష్, బిగ్బాస్ ఫేమ్ సత్య, రవి వర్మ, చమ్మక్ చంద్ర వంటి వారి పాత్రలు చిన్నవే అయినా ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి. ముఖ్యంగా కామెడీ ట్రాక్స్ లో బాగా పేలాయి. ఇక శేఖర్ చంద్ర అందించిన పాటలు బాగా సినిమాకి ప్లస్ అయ్యాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.. కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఎక్కడ పేరు పెట్టకుండా సినిమాకి తగ్గట్టు అవుట్ ఫుట్ తెచ్చుకోవడంలో యూనిట్ సఫలమైంది.. ఎడిటింగ్ విషయంలో కూడా ఎలాంటి వంకలు పెట్టకుండా క్రిస్పీగా కట్ చేసుకున్నారు. అయితే భైరవకోన అనే ఒక కొత్త ఊరు మొత్తాన్ని సృష్టించి ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తన పనితనాన్ని చూపించుకున్నట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. నిర్మాణం విలువలు బాగున్నాయి, ఖర్చుకు వెనకాడినట్లు అనిపించలేదు.
ఫైనల్ గా చెప్పాలంటే ఊరు పేరు భైరవకోన ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ.