యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న సుహాస్ ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట లాంటి సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇప్పుడు సుహాస్ హీరోగా ప్రసన్న వదనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ వద్ద అసోసోయేట్ గా పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ట్రైలర్ లో ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. అలా ఆశక్తి రేపుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ:
ఓ ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జే గా పని చేస్తున్న సూర్య(సుహాస్
ఓ యాక్సిడెంట్ లో తల్లితండ్రులని కోల్పోతాడు. అయితే దానికి తోడు ఒక అరుదైన డిజార్డర్ కూడా ఏర్పడుతుంది. బలంగా తలకి గాయం అవ్వడంతో ఫేస్ బ్లైండ్ నెస్ అనే డిజార్డర్ కూడా ఏర్పడుతుంది. దాని వలన సూర్య ఇక ఎవరి మొహాలని గుర్తుంచ లేడు. వాళ్ళ గొంతు సైతం గుర్తు ఉండదు. అలాంటి క్రమంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఓ అర్ధరాత్రి దారుణమైన హత్య చూస్తాడు. అమృత( సాయి శ్వేత)అనే అమ్మాయిని లారీ కింద తోసేస్తారు. ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసినా సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ ఉండడం వలన ఆ తోసిన వ్యక్తి ఎవరు అనేది గుర్తు పట్టలేడు. మరుసటి రోజు యాక్సిడెంట్ ని వార్తల్లో చూసి బాదితురాలికి న్యాయం జరగాలని భావించి.. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి జరిగిన అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్ గా తీసుకుని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? అసలు అమృతని ఎవరు చంపారు? చివరికి ఏమైంది అనే విషయాలు స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే..
విశ్లేషణ:
ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు అనేక డిజార్డర్ల మీద సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో మనలో చాలా మందికి తెలియని ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేసి దాదాపు సఫలం అయ్యాడు. సూర్య తల్లితండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం ఆ తరువాత ఆ ఇబ్బందుల వలన పడే బాధలు, అధ్య( పాయల్ రాధకృష్ణ)తో ఓ లవ్ స్టోరీ, ఈ డిజార్డర్ బయట పడకుండా స్నేహితుడితో కలిసి మేనేజ్ చేసే ప్రయత్నం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక మర్డర్ జరిగిన అనంతరం కథ వేగం పుంజుకుంటుంది. అయితే అప్పటి వరకు సాగిపోతున్న కథలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం మరింత ఆసక్తికరం అనిపిస్తుంది. ఇక ఈ అనంతరం సెకండ్ హాఫ్ కూడా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ట్విస్ట్ ని ఎవరూ ఊహించని విధంగా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సూర్య పాత్రలో ఎప్పటిలాగే సుహాస్ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ తో కూడా అదరగొట్టాడు. సుహస్ ప్రేయసి పాత్రలో పాయల్ లవ్ ట్రాక్ బాగుంది. రాశి సింగ్ కి కూడా మంచి పాత్ర పడింది. నితిన్ ప్రసన్నకు అంబాజీ పేట అనంతరం మంచి రోల్ పడింది. ఇక వైవా హర్ష కూడా ఎప్పటిలానే నవ్వించాడు. సత్య పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే బేబీ సినిమాతో ఒకసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం కథని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైట్స్ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.
ఫైనల్లీ : ప్రసన్న వదనం… వర్త్ వాచ్