Sudigali Sudheer Calling Sahasra Movie Review: జబర్దస్త్ షో ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. అక్కడ వచ్చిన క్రేజ్ తో సినిమా హీరోగా మారిన సుధీర్ ఇప్పటికే సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక గాలోడు సినిమా మంచి హిట్ కూడా అయిన నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర అనే సినిమా తెరకెక్కింది. టీజర్, పాటలు, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కాలింగ్ సహస్ర కథ:
సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయిన అజయ్ శ్రీవాస్తవ(సుడిగాలి సుధీర్) బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఒక కొత్త సిమ్ కొనుగోలు చేస్తాడు. ఆ సిమ్ కొనుగోలు చేసిన తర్వాత అదే సిమ్ నుంచి అంటే అతని ఫోన్ నుంచి అతనికి మెసేజ్ లు వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్లను ఫాలో అయ్యి వెళ్లి ఒకసారి ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఆ ఫోన్ నుంచి ఆ ఫోన్ కి మెసేజ్ లు ఎలా వస్తున్నాయి? అజయ్, అతని తమ్ముడు సత్య (రవితేజ నన్నిమాల), వారింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి వచ్చిన స్వాతి (డాలీ షా) మర్డర్ కేసులో ఎందుకు ఇరుక్కున్నారు? ఈ ముగ్గురికి లూసిఫర్ అనే యాప్ కి సంబంధం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే కాలింగ్ సహస్ర సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ:
కాలింగ్ సహస్ర అనే పేరు వినగానే చాలా మందికి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం ఇది కొత్త కథ ఏమీ కాదు అని ఈజీగా అర్థమయిపోతుంది. గతంలో ఇదే లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి రొటీన్ స్టోరీతోనే మరోసారి సుధీర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏమీ సంబంధం లేని ఒక వ్యక్తి జీవితంలోనికి ఒక వస్తువు ద్వారా ఆత్మ రావడం, అతని ప్రమేయం లేకుండా తన పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం, ఆ తరువాత నెమ్మదిగా ఫ్లాష్ బ్యాక్ అంతా రివీల్ చేయడం ఇలా ఈ సినిమా మొత్తం ఒక ఫార్మాట్ లో సాగిపోయింది. సినిమా మొత్తం మీద ఏ మాత్రం కొత్తదనం లేదు అనిపించేలా టేకింగ్ ఉంది. అయితే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కోసం కొన్ని ఫైట్లు మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. సుడిగాలి సుధీర్ అంటేనే కామెడీ కి పెట్టింది పేరు, ఆ కామెడీని పక్కన పెట్టి ఆయనతో సీరియస్ రోల్ ఎందుకు చేయించాలి అనుకున్నారో తెలియదు. కానీ అది పెద్దగా ఆకట్టుకునేలా అనిపించలేదు. రొటీన్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆత్మతో సంబంధం ఉన్న కథ కావడంతో కాస్త హారర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొదటి హాఫ్ అంతా క్యారెక్టర్ లను పరిచయం చేయడంతోనే పూర్తి చేసిన దర్శకుడు ఇంటర్వెల్ ముందు హీరో అండ్ గ్యాంగ్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో కాస్త ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత సెకండ్ హాఫ్ లో ఏ మాత్రం ల్యాగ్ లేకుండా ఫ్లాష్ బ్యాక్ అంతా రివీల్ చేస్తూ ముందుకు వెళ్లాడు. ఫస్ట్ ఆఫ్ కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగినా సెకండ్ హాఫ్ అంతా త్వరత్వరగా ముగిసిపోతూ సినిమా రివీల్ చేసిన విధానం బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే అజయ్ శ్రీవాత్సవ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో సుడిగాలి సుధీర్ ఎప్పటిలాగే తనకు బాగా అలవాటైన పాత్రలో నటించినట్టు నటించాడు. సుధీర్ తమ్ముడు పాత్రలో రవితేజ నన్నిమాల తనదైన టైమింగ్ తో అలరించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు స్పందన, డాలీ షా పర్వాలేదనిపించారు. చాలాకాలం తర్వాత శివబాలాజీకి ఒక లెంగ్తీ రోల్ దొరికింది. సుభాష్, రవి ప్రకాష్ వంటి వారు తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. కథనం విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది, అది గ్రిప్పింగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగినట్లుగా సరిపోయింది. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం పర్వాలేదు కానీ పాటలు పెద్దగా గుర్తించుకోతగినట్టు కనిపించలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ : కాలింగ్ సహస్ర వన్ టైం వాచబుల్ మూవీ.