శర్వానంద్ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. కానీ, నిర్మాతల ప్లానింగ్‌తో ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్‌తో రిలీజ్ అయింది. అయితే సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే గౌతమ్ (శర్వానంద్), అదే కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే అనూహ్యంగా గౌతమ్ పాస్ట్ రిలేషన్ కారణంగా ఈ పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి. ఆ రిలేషన్ కారణంగా ఎందుకు పెళ్లికి ఇబ్బంది ఏర్పడింది? అసలు గౌతమ్ పాస్ట్ రిలేషన్‌లో ఉన్న దియా(సంయుక్త)తో ఎందుకు బ్రేకప్ అయింది? గౌతమ్ తండ్రి కార్తీక్ (సీనియర్ నరేష్) లేటు వయసులో ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు? అతని లేటు పెళ్లి గౌతమ్ పెళ్లికి అడ్డంకిగా మారిందా? చివరికి గౌతమ్ నిత్యను పెళ్లి చేసుకున్నాడా లేదా? గౌతమ్ లైఫ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన దియా ఏం చేసింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
కాంప్లెక్స్ రిలేషన్షిప్ కాన్సెప్ట్‌తో గతంలో ‘సామజవరగమన’ అనే సినిమా తీసి హిట్ కొట్టిన రామ్ అబ్బరాజు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే, అందరి అంచనాలు సినిమా మీద పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది. అయితే సినిమా మొదలైనప్పుడే పూర్తిగా ఇది కామెడీ ఫ్లేవర్‌లో సాగిపోతున్న ఓ సరదా సబ్జెక్ట్ అనే హింట్ ఇచ్చేశారు. ఎక్కువ సాగతీత లేకుండా సినిమాలోకి తీసుకువెళ్ళిపోయిన దర్శకుడు, హీరో సాక్షితో ప్రేమలో పడటం, ఆ తర్వాత సరదా సరదాగా సాగిపోతున్న సన్నివేశాలు, వారి పెళ్లికి వచ్చే అడ్డంకులు అంటూ వాటి మీదే జోక్స్ రాసుకుని వర్కౌట్ చేశారు.
ఒకరకంగా చెప్పాలంటే, సీనియర్ నరేష్ క్యారెక్టర్ తెరమీద కనిపించిన ప్రతిసారి కామెడీ వర్కౌట్ అయింది. సరదాగా సాగిపోతూనే ఆలోచింపజేసేలా ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు. కుర్రతనంలో యువత చేసే కొన్ని తప్పులు తర్వాత కాలంలో వారి మెడకు ఎలా చుట్టుకుంటున్నాయి అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ సినిమా కథ రాసుకొని, అంతే ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దాదాపు సక్సెస్ అయ్యాడు.
‘సామజవరగమన’లో ఎలాంటి కాంప్లెక్స్ పాయింట్ ఉంటుందో, ఇక్కడ కూడా అలాంటి ఓ కాంప్లెక్స్ పాయింట్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సత్య, నరేష్, వెన్నెల కిషోర్, ఆఖరికి సంపత్ క్యారెక్టర్లతో కూడా కామెడీ వర్కౌట్ చేయించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. వాస్తవానికి చాలా సీరియస్ సబ్జెక్ట్‌ని లైటర్ వేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు దాదాపు అందులో సక్సెస్ అయ్యాడు. ఒక 60 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సమాజం నుంచి ఎదుర్కొనే హేళనలు అయినా సరే, ప్రేమతో వారిద్దరూ మెలిగే సన్నివేశాలు కొన్ని నిజ జీవిత సంఘటనలను గుర్తు తెచ్చాయి. “ప్రేమకు వయసు ఏమిటి?” అంటూ ప్రశ్నించిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. అదే విధంగా “కుర్రతనంలో చేసే తప్పులు జీవితాంతం వెంటాడకూడదు” అంటూ చెప్పే కొన్ని లైన్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తానికి పండక్కి ఒకపక్క నవ్విస్తూ, మరోపక్క ఆలోచింపజేస్తూ ఒక ఫుల్ ఫన్ రైడ్ అందించింది ‘నారీ నారీ నడుమ మురారి’ టీం.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
నటీనటుల విషయానికి వస్తే, ఇద్దరు భామల మధ్య నలిగిపోయే వ్యక్తిగా ఈ సినిమాలో శర్వానంద్ కనిపించాడు. శర్వానంద్‌కి ఇలాంటి తరహా పాత్రలు చాలా కొట్టిన పిండి. దీంతో ఈ పాత్రలో శర్వానంద్ నటించలేదు, జీవించాడు అని అనేలా పెర్ఫార్మ్ చేశాడు. ఇక సాక్షి వైద్య పాత్రకి చాలా స్కోప్ దొరికింది. ఆమె స్క్రీన్ మీద అందంగా కనిపించడమే కాదు, పద్ధతిగా కనిపిస్తూ ప్రేక్షకులందరి చూపుని తనవైపు తిప్పుకుంది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. అయితే సంయుక్త పాత్ర మాత్రం ఈ సినిమాలో ఎందుకో సెకండ్ హీరోయిన్ లా అనిపించింది. ఆమె పాత్ర కనిపించింది తక్కువ సేపే; కనిపించిన ప్రతిసారి ఎందుకో ఆమెలో ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సంపత్ క్యారెక్టర్‌తో పాటు సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ వంటి వాళ్ళు కనిపించిన ప్రతిసారి ఆకట్టుకున్నారు. ఇక హీరో శర్వానందే కానీ, ఆ తర్వాత అంతలా లీడ్ తీసుకున్న నటుడు నరేష్. నరేష్ పాత్ర లేకుండా ఈ సినిమా 100% పూర్తి కాదనే చెప్పాలి. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమాని చాలా కలర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. అలాగే సాంగ్స్ కూడా కొన్ని వినడానికి బాగున్నాయి. అయితే ప్లేస్‌మెంట్ ఎందుకో కరెక్ట్‌గా సెట్ అవ్వలేదని ఫీలింగ్ కలిగింది. మొత్తంగా చూసుకుంటే ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది, కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా కొంచెం కేర్ తీసుకుని, స్పీడ్ బ్రేకర్లలా అనిపించిన సాంగ్స్‌ని తప్పిస్తే ఇంకా క్రిస్పీగా ఉండేదేమో అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ డిజైన్ బావుంది, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్లీ: ‘నారీ నారీ నడుమ మురారి’.. ఫుల్లీ ఎంగేజింగ్ ఫన్ రైడ్ విత్ మెసేజ్!